బాంబ్ బ్లాస్ట్ నిందితులతో మాకు సంబంధం లేదు : అల్‌ఫలాహ్ యూనివర్సిటీ

by Naga Rani Yarlagadda |

ఢిల్లీ పేలుళ్లకు పాల్పడిన నిందితులతో తమకెలాంటి సంబంధం లేదని అల్-ఫలాహ్ యూనివర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

బాంబ్ బ్లాస్ట్ నిందితులతో మాకు సంబంధం లేదు : అల్‌ఫలాహ్ యూనివర్సిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబు పేలుడు వెనుక అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఆరుగురు డాక్టర్ల హస్తం ఉందని దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారిని అరెస్ట్ చేసి విచారణ కూడా చేస్తున్నాయి. ఈ క్రమంలో యూనివర్సిటీపై పలు రకాల కథనాలు వస్తుండటంపై యాజమాన్యం స్పందించింది. పేలుడు నిందితుల పర్సనల్ లైఫ్ తో తమకెలాంటి సంబంధం లేదంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరుతో విడుదలైన ఈ ప్రకటనలో.. పేలుళ్లకు పాల్పడిన వైద్యులతో తమకు వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉన్నట్లు తెలిపింది. 1997 నుంచి అల్-ఫలాహ్ గ్రూప్ వివిధ విద్యాసంస్థలను రన్ చేస్తోందని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు రావడంతో.. యూనివర్సిటీగా మారిందని తెలిపింది.

2019 నుంచి యూనివర్సిటీలో MBBS కోర్సును నిర్వహిస్తుండగా.. అక్కడ చదివి డాక్టర్ పట్టాలందుకున్నవారు భారత్ తోపాటు విదేశాల్లోని ప్రముఖ హాస్పిటల్స్, సంస్థల్లో పనిచేస్తున్నట్లు తెలిపింది. కానీ.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత తమ యూనివర్సిటీ, ఇక్కడ చదువుతున్న మిగతా స్టూడెంట్స్ పై వచ్చిన వార్తలు ఎంతో మనోవేదనకు గురిచేశాయని తెలిపింది. తమవద్ద పనిచేస్తోన్న ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందన్న యాజమాన్యం.. వారితో కేవలం వృత్తిపరమైన కనెక్షన్ మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేసింది. తమ వర్సిటీలో ఎలాంటి కెమికల్స్ ను నిల్వ చేయడం లేదని, తమ కోర్సులకు తగ్గట్లే ల్యాబ్స్ ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి కథనాలు రాసేటపుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకున్నాకే రాయాలని ప్రకటనలో కోరింది.

Next Story