మేము అద్దెదారులం మాత్రమే.. అసలు యజమానులు వాళ్లే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మేము అద్దెదారులం మాత్రమే.. అసలు యజమానులు వాళ్లే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్లను ఆలోచింపజేసే, నవ్వించే ఎన్నో పోస్ట్‌లను ఆయన ఎక్స్ (X) వేదికగా పంచుకుంటారు. తాజాగా ఆయన తన కాఫీ ఎస్టేట్‌లో దర్జాగా విహరించిన ఏనుగుల గుంపునకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు. కర్ణాటకలోని కొడగులో తమ కుటుంబానికి చెందిన కాఫీ ఎస్టేట్‌ను తన సోదరి నిర్వహిస్తుంటారని, ఆ తోటను తాము తమ దత్తత తీసుకున్న ‘పూర్వీకుల నివాసం’గా భావిస్తామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. తాజాగా ఏనుగుల గుంపు ఎస్టేట్‌లోని అరాబికా తోటల వైపు ఉన్న గేటు నుంచి లోపలికి వచ్చి, రోడ్డును దాటి రోబస్టా తోటల వైపు వెళ్లిన వీడియోను తన సోదరి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

తోట వాళ్లదే.. మేం తాత్కాలిక అద్దెదారులమే!

ఏనుగులు తమ తోటలోకి రావడం కొత్తగా జరుగుతున్న పరిణామం కాదని ఆయన స్పష్టం చేశారు. పనస పండ్లను తినేందుకు దశాబ్దాలుగా ఈ గజరాజులు అక్కడికి వస్తూనే ఉంటాయని వెల్లడించారు. ‘కానీ, ఈ సారి మాత్రం అవి టీ, స్నాక్స్ కోసం అధికారికంగా ఆహ్వానం అందుకున్నట్లు ఎంతో దర్జాగా, ఆత్మవిశ్వాసంతో మెయిన్ గేటు నుంచి నడుచుకుంటూ వచ్చాయి. ఆ తోట ఎప్పటికీ వారిదేనని, మేం కేవలం తాత్కాలిక అద్దెదారులం మాత్రమేనన్న భావన నాకు కలుగుతోంది’ అని మహీంద్రా తన ట్వీట్‌లో ఆసక్తికరంగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story