Waqf: వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సీపీఐ

by B.Srinivas |

వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Waqf: వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం..  సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సీపీఐ
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ చట్టం (Waqf amendment act) 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (Cpi) సుప్రీంకోర్టును (Supreme court) ఆశ్రయించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డీ రాజా (Raja) ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బిల్లును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సభ్యులు, ఇతర ప్రతినిధులు లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించి అమలు చేశారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టం వక్ప్ బోర్డు స్వయం ప్రతిపత్తిని బలహీనపర్చడంతో పాటు, 1995 వక్ఫ్ చట్టం నిర్మాణాన్ని ప్రాథమికంగా మారుస్తుందని సీపీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేగాక వక్ప్ బోర్డు పరిపాలనపై ప్రభుత్వానికి అపరిమిత అధికారం ఇస్తుందని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో (Fundamental Rights) భాగమైన ఆర్టికల్ 25, 26, 29లో పొందు పర్చిన హక్కులను ఉల్లంఘిస్తుందని తెలిపింది.

కాగా, వక్ప్ సవరణ చట్టం ఇటీవలే దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు సుమారు 20కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారించనుంది. మరికొన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇంకా ధర్మాసనం ఎదుట జాబితా చేయాల్సి ఉంది. ఈ విషయంలో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసేముందు విచారణ చేపట్టాలని కేంద్రం సైతం అత్యున్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story