ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చా.. ప్రజల సొమ్ము వృథా చేయను: తొలి ప్రసంగంలో విజయ్ హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

‘ఒక సామాన్య సినిమా డైరెక్టర్ కుమారుడు నేడు మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాడు’ అంటూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ప్రసంగాన్ని అత్యంత భావోద్వేగంగా ప్రారంభించారు.

ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చా.. ప్రజల సొమ్ము వృథా చేయను: తొలి ప్రసంగంలో విజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఒక సామాన్య సినిమా డైరెక్టర్ కుమారుడు నేడు మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాడు’ అంటూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన ప్రసంగాన్ని అత్యంత భావోద్వేగంగా ప్రారంభించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేశారు. "ఈ స్థాయికి రావడానికి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు, అడ్డుకోవాలని చూశారు. కానీ, వాటన్నింటినీ అధిగమించి ఈ రోజు మీ ముందు నిలబడ్డాను. నేను మీ అందరి వాడిని" అని విజయ్ పేర్కొన్నారు. తన విజయం వెనుక పార్టీ కార్యకర్తల అలుపెరుగని కృషి ఉందని, వారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన ప్రకటించారు. తన ప్రభుత్వంలో కులమతాలకు తావులేదని విజయ్ స్పష్టం చేశారు. "మేము ఎలాంటి కక్షసాధింపు రాజకీయాలకు పోము. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. రైతులు, మహిళలు, విద్యార్థులకు నా ప్రభుత్వం కొండంత అండగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన వద్దు.. మీ 'విజయ్ మామ' మీకు తోడుగా ఉంటాడు" అని హామీ ఇచ్చారు.

ఖజానా ఖాళీ.. త్వరలో శ్వేతపత్రం..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. "గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అసలు వాస్తవాలు ప్రజలకు తెలియాలి, అందుకే త్వరలోనే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేస్తాం. ప్రజల సొమ్మును వృథా చేయను, ఎవరినీ దోచుకోనివ్వను" అని గట్టిగా చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడమే తన మొదటి లక్ష్యమని విజయ్ ప్రకటించారు. "ఈ రోజు నుంచే డ్రగ్స్‌పై మా పోరాటం మొదలవుతుంది" అని స్పష్టం చేశారు. అదే సమయంలో తన పార్టీ (TVK) నాయకులను హెచ్చరిస్తూ.. "ఎవరూ అహంకార ధోరణి ప్రదర్శించొద్దు. ఈ ప్రభుత్వంలో నేనే పవర్ సెంటర్, రెండో పవర్ సెంటర్‌కు ఇక్కడ చోటు లేదు" అని నిరంకుశత్వానికి, అవినీతికి తావులేదని పరోక్షంగా హెచ్చరించారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రతి పైసా లెక్క పారదర్శకంగా ఉంటుందని విజయ్ ప్రజలకు భరోసా ఇచ్చారు. దశాబ్దాల రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, అభివృద్ధి పథంలో తమిళనాడును నడిపిస్తానని ఆయన శపథం చేశారు.

Next Story