- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం
తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వెండితెరపై దళపతిగా వెలిగిన జోసెఫ్ విజయ్, ఇప్పుడు తమిళ గడ్డపై ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. వెండితెరపై దళపతిగా వెలిగిన జోసెఫ్ విజయ్, ఇప్పుడు తమిళ గడ్డపై ముఖ్యమంత్రిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కిక్కిరిసిన జనసందోహం, అభిమానుల అరుపులు, కేకల మధ్య విజయ్‌తో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. విజయ్‌తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఏడుగురికి కీలక శాఖలను ఇప్పటికే కేటాయించగా, మరో ఇద్దరికి శాఖల కేటాయింపుపై కసరత్తు జరుగుతోంది. త్వరలోనే వారికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ కొత్త మంత్రివర్గంలో అనుభవజ్ఞులతో పాటు యువతకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తోంది. పార్టీని స్థాపించిన అతి తక్కువ కాలంలోనే, పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నేతగా విజయ్ సరికొత్త రికార్డును సృష్టించారు.
తొలి ప్రయత్నంలోనే అప్రతిహత విజయం..
సినిమాలకు స్వస్తి చెప్పి, ప్రజా సేవకై 'తమిళ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన విజయ్, తన తొలి ఎన్నికల్లోనే కమల, డీఎంకే వంటి బలమైన శక్తులను ఢీకొని అఖండ విజయాన్ని అందుకున్నారు. ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత వెండితెర నుంచి వచ్చి రాజకీయాల్లో అసాధారణ విజయం సాధించిన నేతగా విజయ్ పేరు మారుమోగిపోతోంది. విజయ్ సీఎంగా ప్రమాణం చేయడంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ విజయ్ కటౌట్లు, పార్టీ జెండాలతో నిండిపోయాయి.
సీఎం విజయ్ – హోం, ప్రజాపాలన శాఖలు.
ఆధవ అర్జున్ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ.
సెంగొట్టాయన్ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD).
వెంకట్రామన్ – పాఠశాల విద్యాశాఖ.
ఎన్. ఆనంద్ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.
నిర్మల్ కుమార్ – విద్యుత్ శాఖ.
రాజమోహన్ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ.
అరుణ్ రాజ్ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్ శాఖ.
కీర్తన, టీకే ప్రభులకు ఇంకా శాఖలు కేటాయించని విజయ్.






