ర్యాలీకి అనుమతి నిరాకరణ: స్టాలిన్‌పై యుద్ధం ప్రకటించిన విజయ్

by Gantepaka Srikanth |

తమిళనాడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తూ, అధికార డీఎంకే (DMK) ప్రభుత్వంపై తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ర్యాలీకి అనుమతి నిరాకరణ: స్టాలిన్‌పై యుద్ధం ప్రకటించిన విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తూ, అధికార డీఎంకే (DMK) ప్రభుత్వంపై తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నైలో నిర్వహించ తలపెట్టిన టీవీకే భారీ బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ తీరును "ప్రజాస్వామ్యంపై ఫాసిస్ట్ దాడి"గా ఆయన అభివర్ణించారు. సభకు అనుమతి నిరాకరించడంపై విజయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వం తన గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. "ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్లే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కానీ, ప్రభుత్వం అధికారులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది. ఇది ఫాసిజానికి పరాకాష్ట" అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం టీవీకే ఎదుగుదల చూసి భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ర్యాలీకి అడ్డంకులు.. పోలీసుల నిబంధనలు..

గతంలో జరిగిన కొన్ని సంఘటనలను సాకుగా చూపుతూ, భారీ బహిరంగ సభల నిర్వహణపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలు (SOP) అమలు చేస్తోంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు మరియు భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు టీవీకే ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఇతర రాజకీయ పార్టీల సభలకు లేని నిబంధనలు తమకే ఎందుకు వర్తింపజేస్తున్నారని విజయ్ ప్రశ్నించారు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రధాన ప్రత్యర్థి టీవీకే మాత్రమేనని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. "మేము ప్రజల పక్షం, ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకం" అంటూ ఆయన తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజా పరిణామాలతో తమిళనాడులో డీఎంకే మరియు టీవీకే మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరింది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల్లోకి వెళ్లడం ఆపబోమని విజయ్ అనుచరులు స్పష్టం చేస్తున్నారు.

Next Story