ఢిల్లీకి రావాల్సిందే..! తొక్కిసలాట ఘటన‌లో విజయ్‌కి మళ్లీ సీబీఐ సమన్లు

by Ramesh Naini |   (  Updated:2026-03-10 12:10:27  IST  )

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ మళ్లీ సమన్లు జారీ చేసింది.

ఢిల్లీకి రావాల్సిందే..! తొక్కిసలాట ఘటన‌లో విజయ్‌కి మళ్లీ సీబీఐ సమన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 15న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నిజానికి ఈ కేసులో విజయ్ మంగళవారం (మార్చి 10) విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని, తనకు 15 రోజుల సమయం కావాలని విజయ్ సీబీఐని కోరినట్లు తెలిసింది. అంతేకాకుండా, విచారణను చెన్నైలో లేదా తమిళనాడులోని ఏదైనా కార్యాలయంలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, సీబీఐ అధికారులు మాత్రం మార్చి 15న ఢిల్లీకి రావాల్సిందేనని స్పష్టం చేస్తూ తాజా సమన్లు పంపారు. గత జనవరిలో విజయ్‌ను అధికారులు ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

విచారణకు ఎమ్మెల్యే సిద్ధం..

ఇదే కేసులో కరూర్ డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి కూడా సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనను మార్చి 17న విచారణకు రావాలని కోరింది. దీనిపై సెంథిల్ బాలాజీ సామాజిక మాధ్యమం 'X' వేదికగా స్పందిస్తూ.. మార్చి 17న విచారణకు హాజరవుతానని, కరూర్ విషాదంపై సీబీఐకి పూర్తి వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. కాగా, 2025 సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. తొలుత ఎస్ఐటీ (SIT) దర్యాప్తు చేయగా, బాధితులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

Next Story