ప్రమాణం చేసిన వెంటనే ప్రజలకు గిఫ్ట్.. తొలి సంతకంతోనే సంచలనం సృష్టించిన విజయ్

by Gantepaka Srikanth |

తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభమైంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు.

ప్రమాణం చేసిన వెంటనే ప్రజలకు గిఫ్ట్.. తొలి సంతకంతోనే సంచలనం సృష్టించిన విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభమైంది. తమిళ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదివారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక వేడుకలో విజయ్‌తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగానికి చెందిన ఉద్ధండులు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరై విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్టేడియం లోపలే కాకుండా, వెలుపల కూడా లక్షలాది మంది అభిమానులు తమ అభిమాన నటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతుంటే ఆనందంతో కేరింతలు కొట్టారు. చెన్నై నగరం మొత్తం 'దళపతి' నినాదాలతో మారుమోగిపోయింది.

తొలి సంతకంతోనే సంచలనం..

ప్రమాణస్వీకారం పూర్తి చేసిన వెంటనే సీఎం విజయ్ నేరుగా పాలనపై తన మార్క్ చూపించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు '200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్' పథకానికి సంబంధించిన ఫైలుపై ఆయన తన తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. పాలనలో తన ప్రాధాన్యత సామాన్యుల సంక్షేమమేనని ఈ తొలి సంతకంతో విజయ్ స్పష్టం చేశారు. మహిళా భద్రతపై తొలి సంతకం, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై మూడో సంతకం చేశారు.

రికార్డుల విజయ్..

పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే, తన మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలుచుకున్న విజయ్.. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే ప్రభంజనం సృష్టించారు. దశాబ్దాలుగా ఉన్న ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని కాదని తమిళ ప్రజలు విజయ్‌కు పట్టం కట్టడం విశేషం. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. విజయ్ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి త్వరలోనే పూర్తిస్థాయిలో పాలనపై సమీక్ష నిర్వహించనున్నారు.

Next Story