బెంగళూరులో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారుల దుర్మరణం.. వీడియో వైరల్

by Ramesh Naini |

కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది.

బెంగళూరులో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారుల దుర్మరణం.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం ఉదయం అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సు చక్రాల కింద పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తర బెంగళూరులోని థానిసాంద్ర సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. హెన్నూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను వర్ష (2), భాను (4) గా గుర్తించారు. వీరు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (CAR) విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ నాగనగౌడ కుమార్తె , మేనకోడలు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది.

కళ్లెదుటే ప్రాణాలు పోయాయి..

పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ నాగనగౌడ తన ద్విచక్ర వాహనంపై కూతురు వర్ష, తన అన్న కూతురు భానులను ఎక్కించుకుని పాలు తీసుకురావడానికి బయలుదేరారు. ఆ సమయంలో స్కూల్ పిల్లలను పికప్ చేసుకునేందుకు వచ్చిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు, మలుపు తిరుగుతూ ఆగి ఉన్న నాగనగౌడ స్కూటీని ఢీకొట్టింది. ప్రమాద ధాటికి స్కూటీ ముందు భాగంలో ఉన్న పిల్లలిద్దరిపై బస్సు వెనుక చక్రం దూసుకెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి నప్పటికీ, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ నాగనగౌడకు స్వల్ప గాయాలయ్యాయి.

పోలీసుల చర్యలు...

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం యలహంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన స్కూల్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెన్నూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story