సింహం, ప్రధాని మోడీ ఒకే ఫ్రేమ్‌లో.. కలిసి ఆడుకున్న వీడియో వైరల్‌

by Yella Dhawani Reddy |   (  Updated:2025-03-04 12:14:52  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) మంగళవారం గుజరాత్‌లో (Gujarat) ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం 'వాంతరా'ను (Vantara) ప్రారంభించారు.

సింహం, ప్రధాని మోడీ ఒకే ఫ్రేమ్‌లో.. కలిసి ఆడుకున్న వీడియో వైరల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తరచూ వైల్డ్ లైఫ్ సఫారీలు చేస్తుండటం తెలిసిందే. ఈ సందర్భంగా గుజరాత్‌లో (Gujarat) ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వాంతరా' (Vantara) వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం కేంద్రాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల వన్య ప్రాణులతో మోడీ సన్నిహితంగా మెలిగారు. ఆసియాటిక్ సింహం, చిరుత, ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్‌, హిప్పోపొటామస్‌, మొసళ్ళు, ఏనుగులు, పెద్ద పాములు మొదలైన జంతువులను మోడీ సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అంతేకాదు, కేంద్రంలోని ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, అంతరించిపోతున్న జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్లలకు మోడీ స్వయంగా పాలు పట్టించారు. అలాగే, మోడీ వాంతరాలోని వన్యప్రాణుల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్‌లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు.

కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన ఏనుగుల ఆసుపత్రిని కూడా మోడీ ఈ సందర్భంగా సందర్శించారు. జంతువులను వీక్షించడమే కాకుండా.. వాటికి సేవ చేస్తున్న వైద్యులు, సహాయక సిబ్బంది, కార్మికులతో ప్రధాని సంభాషించారు. వాంతరాలో 2,000 కంటే ఎక్కువ జాతులు.. రక్షించబడిన, అంతరించిపోతున్న 1.5 లక్షలకు పైగా జంతువులు ఉన్నాయి.

Next Story