Uttarakhand: ధరాలీలో జల విలయం.. రంగంలోకి భారత సైన్యం

by B.Srinivas |

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. జిల్లాలోని ధరాలి అనే గ్రామంలో ఆకస్మిక వరదలు సంభవించాయి.

Uttarakhand: ధరాలీలో జల విలయం.. రంగంలోకి భారత సైన్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. జిల్లాలోని ధరాలి అనే గ్రామంలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో బలమైన నీటి ప్రవాహం కారణంగా ఇండ్లు, హోటళ్లు కొట్టుకు పోయాయి. గ్రామం మొత్తం బురదలో చిక్కుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో 50 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తోంది. గ్రామంలో తీవ్ర విధ్వంసం జరిగినందున మృతుల సంఖ్య భారీగా ఉండనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఖీర్ గంగా నది పరీవాహక ప్రాంతంలో మేఘాల విస్ఫోటనం కారణంగా వినాశకరమైన వరదలు సంభవించినట్టు చెబుతున్నారు. చాలా మంది వరద ప్రాంతాలలో చిక్కుకున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ విపత్తు తర్వాత కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీకి చెందిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. 130 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

పూర్తిగా కొట్టుకు పోయిన ధారాలి

భారీ వరదల ప్రభావానికి ధరాలి గ్రామం కొట్టుకుపోయినట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. చార్‌ధామ్ యాత్ర మార్గంలో ఉండటం వల్ల, ధారాలిలో అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, లాడ్జిలు ఉన్నాయి. వరదల కారణంగా సుమారు 20 నుంచి 25 హోటల్స్, గెస్ట్ హౌస్ లు ధ్వంసమైనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా గ్రామం మొత్తం బురద పేరుకుపోవడం, కనెక్టివిటీ అంతరాయం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు వరదల కారణంగా ఆర్మీ క్యాంపులో ఉన్న 10 మంది సైనికులు సైతం గల్లంతైనట్టు సమాచారం. హర్షిల్‌లోని క్యాంపులో ఉన్న వీరు కనిపించడం లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, ధరాలి ఉత్తరకాశి జిల్లాలోని ఒక చిన్న గ్రామం. గంగోత్రి ధామ్ ఇక్కడి నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పర్యాటకులకు, యాత్రికులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా ఉంది.

వరదకు కారణమిదేనా?

ఉత్తరాఖండ్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ధరాలీకి సమీపంలోకి ఖీర్ గంగా నదీ పరివాహక ప్రాంతంలో భారీగా నీరు నిలిచిందని, ఈ క్రమంలోనే ఒక్కసారిగా వరదగా పోటెత్తిందని స్థానికులు చెబుతున్నారు. అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఘటనకు గల కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు పరిశోధనలు ప్రారంభించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు రోడ్లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి.

ధరాలి ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. కుంభవృష్టి కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. ప్రజలను రక్షించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని కేంద్ర సహాయం అందజేస్తామని వెల్లడించారు. ఉత్తరాఖండ్ సీఎం ధామితో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం సీఎం ధామితో మాట్లాడారు. రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

Next Story