విద్యుత్‌ను చూసి వాడుకోండి: కేంద్ర విద్యుత్‌ శాఖ విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-22 12:44:02  IST  )

దేశంలో వేసవి కాలం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

విద్యుత్‌ను చూసి వాడుకోండి: కేంద్ర విద్యుత్‌ శాఖ విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో వేసవి కాలం తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎండల తీవ్రత కారణంగా పగటిపూట కరెంట్ వాడకం ఊహించని విధంగా భారీగా పెరిగిపోతోందని కేంద్ర విద్యుత్ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ విద్యుత్‌ను ఎంతో జాగ్రత్తగా, చూసి వాడుకోవాలని ఎక్స్ వేదికగా కోరింది. అనవసరంగా కరెంట్‌ను వృథా చేయకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.

భారతదేశంలో కరెంట్ వినియోగం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తీవ్రమైన వడగాల్పుల (Heat Wave) నేపథ్యంలో.. మే 21వ తేదీన పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 270.82 గిగావాట్లకు (GW) చేరి చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత నాలుగు రోజులుగా దేశంలో విద్యుత్ డిమాండ్ అంతకుముందు ఉన్న అన్ని రికార్డులను ముక్కలు చేస్తూ దూసుకుపోతోందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా పగటిపూట ఇళ్లు, కార్యాలయాలను చల్లబరిచే ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. గణాంకాల ప్రకారం.. మే 18న పగటిపూట గరిష్ట డిమాండ్ 257.37 గిగావాట్లుగా నమోదు కాగా, అది మే 19న 260.45 గిగావాట్లకు, మే 20న 265.44 గిగావాట్లకు పెరిగింది. ఆ తర్వాత మే 21న మరింత పెరిగి రికార్డు స్థాయిలో 270.82 గిగావాట్లను తాకింది.

సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని, ఆ సమయంలోనే ప్రజలు ఏసీలు, కూలర్లను ఎక్కువగా వాడటం వల్ల పగటిపూట ఈ రికార్డు స్థాయి డిమాండ్ ఏర్పడుతుందని మంత్రిత్వ శాఖ వివరించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న వడగాల్పుల వల్ల విద్యుత్ సరఫరా వ్యవస్థలు, గ్రిడ్ నిర్వహణపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ, దేశంలో విద్యుత్ సరఫరా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేశామని కేంద్రం స్పష్టం చేసింది. "అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నప్పటికీ, తీవ్రమైన వేసవి దృష్ట్యా మనమందరం విద్యుత్‌ను ఎంతో జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవడానికి ప్రయత్నిద్దాం" అని కేంద్ర విద్యుత్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Next Story