- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో అనేక ప్రాజెక్టులకు యూఎస్ఏఐడీ నిధులు
యూఎస్ఎయిడ్‌తో భారత దేశానికి 70 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. 1951లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ ఇండియాలో ఆహార సాయం చట్టంపై సంతకాలు చేశారు.

- 1951 నుంచి యూఎస్ఏఐడీ ఆర్థిక సాయం
- విద్యా, ఆరోగ్య రంగాల్లో ఖర్చు
- ఆహార భద్రతకు కూడా సాయం
- స్వచ్ఛ భారత్ మిషన్‌కు కూడా భారీ నిధులు
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియాలో ఓటింగ్ శాతం పెంచడానికి అమెరికా ట్యాక్స్ పేయర్ల డబ్బును బైడెన్ ప్రభుత్వం ఖర్చు చేసిందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇండియాకు 21 మిలియన్ డాలర్ల నిధులను ఓటర్ టర్నవుట్ కోసం అమెరికా పంపించిందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజే) హెడ్ ఎలాన్ మస్క్ కూడా ఆరోపించారు. అప్పటి నుంచి యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ఏఐడీ)పై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నిధుల మళ్లింపులో కాంగ్రెస్ పాత్ర ఉందని బీజేపీ అనుమానిస్తోంది. అయితే యూఎస్ ఎయిడ్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
యూఎస్ఎయిడ్‌తో భారత దేశానికి 70 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. 1951లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ ఇండియాలో ఆహార సాయం చట్టంపై సంతకాలు చేశారు. అప్పటి నుంచి యూఎస్ ఎయిడ్ అనుబంధం ప్రారంభమైంది. యూఎస్ ఎయిడ్ నిధులను దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, ఆర్థిక సంస్కరణలు వంటి అనేక రంగాల్లో ఖర్చు చేశారు. మొదట్లో యూఎస్ఎయిడ్ సంస్థ విద్యా, ఆరోగ్య రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టిది. రోగనిరోధక శక్తి పెంచడానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించింది. 2024లో ఇండియాలో హెచ్ఐవీ ఎయిడ్స్, టీపీ, మాతా శిశు ఆరోగ్యం వంటి కార్యక్రమాలకు దాదాపు రూ.690 కోట్ల మేర ఆర్థిక సాయం చేసింది. దీంతో పాటు విద్యుత్, నీటి సరఫరా, పారిశుథ్యం, పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు కూడా చేపట్టింది.
యూఎస్ ఎయిడ్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌లో 1992 నుంచి 2002 వరకు ఇండియాలో చేపట్టిన కార్యక్రమాల్లో 65 శాతం ఆహారానికి సంబంధిత సహాయంగా పేర్కొంది. అరవై ఏళ్ల పాటు ఇండియాలో నిర్వహించిన ఆహార సహాయ కార్యక్రమం 2011లో ముగిసిందని పేర్కొంది. దీంతో పాటు దేశంలో మోడీ ప్రభుత్వం తొలిసారి ఏర్పడినప్పుడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్‌కు కూడా భారీగా నిధులు ఇచ్చింది. ఎస్ఎంబీతో పాటు పట్టణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పరిశుభ్రమైన నీరు, పారిశుథ్య సేవలను విస్తరించడానికి ఉపయోగపడింది. 2015 జనవరి 13న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, యూఎస్ఏఐడీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేసింది. ఈ మేరకు పట్టణాల్లో యూఎస్ ఎయిడ్‌కు చెందిన వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్‌స్టిట్యూట్ (వాష్), కేపీఎంజీ ఇండియా వంటి ఎన్జీవోలతో కలసి పని చేసింది. యూఎస్ఎయిడ్, కేపీఎంపీ ఇండియా సహకారంతో 2024 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో లక్నోలో అమృత్ 2.0 పేరిట కాంక్లేవ్‌ను నిర్వహించింది.
ఇక ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి కూడా యూఎస్ఏఐడీ సహకరించింది. 2019 సెప్టెంబర్‌లో ఇండియా-ఆఫ్గానిస్తాన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ షో మూడవ ఎడిషన్‌కు యూఎస్ఏఐడీ సహకారం అందించింది. క్లీన్ ఎనర్జీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా భారత ప్రభుత్వానికి యూఎస్ఏఐడీ భాగస్వామ్యం కలిగి ఉంది. ఇది ఇండియా, అమెరికా మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఉంది. పర్యావరణ మంత్రిత్వ శాఖతో కలిసి కర్ణాకట, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అటవీ నిర్వహణలో సాంకేతికత, సాధనాలు ఇతర పద్దతులు ప్రయోగాత్మకంగా అమలు చేసింది. అయితే యూఎస్ఏఐడీ నుంచి వస్తున్న నిధుల ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గత దశాబ్దంలో ఇండియాకు యూఎస్ఏఐడీ నుంచి దాదాపు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12 వేల కోట్లు) మేర సాయం అందింది. ఇది ప్రపంచ నిధుల్లో కేవలం 0.2 నుంచి 0.5 శాతంగా మాత్రమే ఉంది.






