GTRI: భారత్ అలర్ట్‌గా ఉండాలి.. అమెరికా-వియత్నాం ఒప్పందంపై జాగ్రత్త

by S Gopi |

ఒప్పందంతో వియత్నాం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అన్నిరకాల వస్తువులపై టారిఫ్‌లు గణనీయంగా తగ్గుతాయి.

GTRI: భారత్ అలర్ట్‌గా ఉండాలి.. అమెరికా-వియత్నాం ఒప్పందంపై జాగ్రత్త
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అమెరికా-వియత్నాం మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందం మూలంగా ఆసియా ప్రాంతంలోని ఇతర దేశాలకు పోటీ తీవ్రమవుతుందని భావిస్తున్నారు. తాజాగా భారత ఎగుమతిదారులు జాగ్రత్తగా ఉండాలని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్ ఇనీషియేటివ్‌(జీటీఆర్ఐ) హెచ్చరించింది. 2000లో జరిగిన ఒప్పందం ప్రకారం వియత్నాంకు అమెరికాలో 2-10 శాతం మధ్య మాత్రమే టారిఫ్ అమలవుతోంది. వాటిలో టెక్స్‌టైల్, ఫుడ్‌వేర్, ఫర్నీచర్, సీఫుడ్ లాంటివి ఉన్నాయి. ఇటీవల కుదిరిన ఒప్పందంతో వియత్నాం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అన్నిరకాల వస్తువులపై టారిఫ్‌లు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య ఒప్పందంలో భాగంగా వియత్నాంపై 20 శాతం టారిఫ్ అమలవుతుంది. అంతేకాకుండా ఎగుమతుల విలువ 800 మిలియన్ డాలర్ల నుంచి 135 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి. దీనివల్ల ఈ మేరకు ఇతర దేశాలపై ప్రతికూల ప్రభావం తప్పదు. అయితే, ఈ ఒప్పందం ప్రకారం పన్ను రేట్లు పెరగడం వల్ల గతంలో చేసిన స్థాయిలో ఎగుమతులను కొనసాగించడం వియత్నాంకు కష్టంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి తుది నిబంధనలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

భారత్ జాగ్రత్త పడాలి..

అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు భారత్‌కు ఇది అత్యంత కీలకమైన సమయం. వియత్నాం అనుభవం నుంచి భారత అధికారులు నేర్చుకోవాల్సి ఉందని, ఈ సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ముఖ్యమని జీటీఆర్‌ఐ సూచించింది. ఇప్పటివరకు ఉన్న రాయితీలు, సరకుల రవాణా విషయంలో నెలకొన్న అస్పష్టమైన నిబంధనలు, అన్నింటిపైనా ఒకే రేటుతో కూడిన పన్ను వంటివి దీర్ఘకాలంలో వాణిజ్య స్థిరత్వానికి ప్రమాదమని గుర్తించాలి. వియత్నాం ఒప్పందంలోని లోటుపాట్లను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని జీటీఆర్‌ఐ సూచించింది.

Next Story