మరో ఆయిల్ ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్న అమెరికా

by Muthe.Rajitha |

వెనిజులా నుంచి అక్రమంగా చమురు తరలిస్తున్న మరో నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

మరో ఆయిల్ ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్న అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్ : వెనిజులా నుంచి అక్రమంగా చమురు తరలిస్తున్న మరో నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వెనిజులా ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షల్లో భాగంగా.. అక్రమంగా క్రూడాయిల్ ఇతర దేశాలకు తరలిస్తున్నారనే నెపంతో 'ఓలినా' అనే ఆయిల్ ట్యాంకర్‌ను కరీబియన్ సముద్రజలాల్లో స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గతంలో టైమర్-లెస్టే జెండాతో నడిచినప్పటికీ.. నిజానికి అది వెనెజులా 'ఘోస్ట్ ఫ్లీట్' లేదా 'డార్క్ ఫ్లీట్'లో భాగమని అమెరికా ఆరోపిస్తోంది. కాగా నౌకపై ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఆపరేషన్ పూర్తయినట్లు సమాచారం. నౌకలోని సిబ్బంది వివరాలు ఇంకా తెలియరాలేదు. గతంలో స్వాధీనం చేసుకున్న ట్యాంకర్ల మాదిరిగా ఇందులో కూడా అంతర్జాతీయ సిబ్బంది ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదే తరహాలో జనవరి 7న Marinera అనే రష్యా జెండా కలిగిన ట్యాంకర్‌ను ఉత్తర అట్లాంటిక్‌లో, M Sophia అనే పనామా జెండా కలిగిన నౌకను కరీబియన్‌ జలాల్లో అమెరికా స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఇది ఐదో ట్యాంకర్ కావడం గమనార్హం. వెనెజులా చమురును పూర్తిగా నియంత్రించి, ఆ ఎగుమతులను అడ్డుకుని, ఆయిల్‌ను అమెరికా మార్కెట్‌లో విక్రయించాలన్నదే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ చర్యలను వెనిజులా మిత్ర దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలకు విరుద్ధమైన ‘సముద్ర దోపిడీ’ అని విమర్శిస్తున్నాయి.

Next Story