- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హెచ్1బీ వీసాదారులకు మరో షాక్.. 2027 వరకు చాన్స్ లేనట్లే!
హెచ్1బీ వీసాదారులకు మరో షాకిచ్చింది యూఎస్ ప్రభుత్వం. 2027 వరకు వీసా ఇంటర్వ్యూలు వాయిదా వేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయులకు అమెరికా ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. హెచ్1బీ వీసాల రిన్యూవల్ కోసం స్వదేశానికి వచ్చిన వారు మరో ఏడాదిపాటు ఇక్కడే ఉండిపోయేలా చేస్తోంది. వీసా గడువు తీరడంతో స్టాంప్ వేయించుకోవడానికి వచ్చిన వారు భారత్‌లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్ సర్కారు కొత్తగా వీసాదారుల సోషల్ మీడియా ఖాతాలు దర్యాప్తు చేయాలని నిర్ణయించడంతో.. యూఎస్ ఎంబసీలు ఆ పనిలో పడ్డాయి. అంతేకాదు వేరే దేశంలో రిన్యూవల్ స్టాంప్ వేయించుకునే వెసులుబాటును కూడా ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ఏ దేశస్థులు ఆ దేశంలోనే హెచ్1బీ వీసాలను రిన్యూ చేసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో హెచ్1బీ వీసాల రిన్యూవల్ కోసం వచ్చిన వారి ఇంటర్వ్యూలను రీషెడ్యూల్ చేశాయి. వాటిని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పెడతామని చెప్పాయి. ఈ చర్యతో వీసాదారుల గుండెలు గుభేలుమన్నాయి. అంతకాలం ఇక్కడే ఉండిపోతే అమెరికా కంపెనీలు ఉద్యోగాల్లో ఉంచుతాయా? ఒకవేళ ఉంచినా అక్కడే ఉన్న భార్యాపిల్లలకు దూరంగా ఎలా బతకాలి? అని టెన్షన్‌లో పడిపోయారు భారతీయులు.
ఇప్పుడు వీరి టెన్షన్‌లు రెట్టింపు చేస్తూ.. ఇంటర్వ్యూ స్లాట్లు ఖాళీ లేకపోవడంతో కొందరి వీసా రిన్యూవల్ ఇంటర్వ్యూలను వచ్చే ఏడాదికి రీషెడ్యూల్ చేస్తున్నాయి యూఎస్ ఎంబసీలు. వేరే దేశాల్లో స్టాంపులు వేయించుకోవడం కుదరకపోవడంతో భారీ సంఖ్యలో హెచ్1బీ వీసాదారులు స్వదేశాలకు వచ్చారు. అయితే వారి సంఖ్యకు తగ్గట్లు ఎంబసీల్లో ఇంటర్వ్యూ స్లాట్లు, ఉద్యోగులను అమెరికా సర్కారు పెంచలేదు. దీంతో ఈ వీసాదారులు స్వదేశంలో ఇరుక్కుపోయారు. వీరిపై ఆధారపడి యూఎస్‌లో జీవిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా ఇది సమస్యాత్మకంగా మారింది. త్వరలోనే స్కూళ్లు, డిపెండెంట్ల ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్టులపై కూడా ఈ ప్రభావం పడే చాన్స్ ఉంది. అలాగే వీసా ఎక్స్‌పైర్ అయిపోతే కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే ట్రంప్ తెచ్చిన లక్ష డాలర్ల ఫీజు కట్టాలి. ఇలా చేయడానికి ఏ కంపెనీ కూడా ముందుకు రాదు. దీంతో ఈ హెచ్1బీ వీసాదారులు భారత్‌లోనే ఉండిపోవాల్సి రావొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న హెచ్1బీ వీసాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ యూఎస్ దాటి వెళ్లొద్దని కంపెనీలు ఆర్డర్లు వేస్తున్నాయి. ఇలా భారీ సంఖ్యలో హెచ్1బీ వీసాదారులకు కోల్పోవడం అమెరికా ఐటీ రంగానికి కూడా నష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విప్రో, టీసీఎస్, ఇన్‌ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికన్లను హైర్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.






