అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి

by Kema Shiva Kumar |

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పే దిశగా పాకిస్థాన్ వేదికగా రెండో రౌండ్ చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్‌చీతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్ (Islamaba) చేరుకున్నారు. ఈ చర్చల్లో పాకిస్థాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అరఘ్‌చీ ఇప్పటికే పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌లతో సమావేశమై ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణపై చర్చించారు.

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చల కోసం తన ప్రత్యేక ప్రతినిధులు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్‌కాఫ్లను శనివారం ఇస్లామాబాద్‌కు పంపారు. ప్రస్తుతానికి ఇరాన్ ప్రతినిధులు అమెరికాతో నేరుగా సమావేశం కావడం లేదని తెలుస్తోంది. తమ ప్రతిపాదనలను పాకిస్థాన్ అధికారుల ద్వారా అమెరికా బృందానికి చేరవేస్తున్నారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా చమురు రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ప్రధానంగా మంతనాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో జరిగిన మొదటి రౌండ్ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ట్రంప్ ప్రభుత్వం కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించడంతో, ఈ రెండో రౌండ్ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురించాయి. ఒకవేళ తాజా చర్చలు సఫలమైతే పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోయే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Next Story