ట్రంప్ ట్యాక్స్ కొరడా.. ప్రవాస భారతీయులపై 5 శాతం ట్యాక్స్ తప్పదా?

by Phanindra |   (  Updated:2025-05-16 17:17:10  IST  )

యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ట్యాక్స్ కొరడా ఝుళిపించేలా ఉన్నాడు. విదేశాలకు పంపే డబ్బుపై 5 శాతం ట్యాక్స్ విధించాలని అనుకుంటున్నాడు.

ట్రంప్ ట్యాక్స్ కొరడా.. ప్రవాస భారతీయులపై 5 శాతం ట్యాక్స్ తప్పదా?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయులకు యూఎస్‌లోని ట్రంప్ సర్కారు మరో షాకిచ్చేందుకు సిద్ధం అవుతోంది. త్వరలోనే ఒక కొత్త బిల్లు తీసుకొచ్చి, యూఎస్ నుంచి స్వదేశానికి భారతీయులు పంపించే డబ్బుపై 5 శాతం పన్ను విధించే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లును ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీనే ప్రతిపాదించిందట. దీంతో తమ దేశం నుంచి ఇతరదేశాలకు పంపించే ఆదాయంపై అదనంగా 5 శాతం పన్ను విధించనున్నారు. ఇది కేవలం హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులపైనే కాకుండా గ్రీన్ కార్డు పొందినవారిపై కూడా ప్రభావం చూపించనుంది. యూఎస్ ఆర్థిక వ్యవస్థలో మార్పులు చెయ్యడానికి కంకణం కట్టుకున్న ట్రంప్.. దానిలో భాగంగానే ఈ కొత్త బిల్లును తెచ్చినట్లు తెలుస్తోంది.

భారతీయులపై ప్రభావం..

అమెరికాలోని ప్రధాన వలసదారుల్లో భారతీయులు ముఖ్యులు. ఇక్కడ వివిధ వీసా ప్రోగ్రామ్స్ ద్వారా 23 లక్షల మందికిపైగా భారతీయులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరంతా కూడా స్వదేశంలోని కుటుంబాలకు కొద్దోగొప్పో ఆర్థిక సాయం చేయడం కోసం నెలనెలా డబ్బులు పంపుతుంటారు. ఇదేం చిన్న మొత్తం కూడా కాదు. ఒక్క 2023వ సంవత్సరంలోనే భారత్‌కు 23 బిలియన్ డాలర్లు యూఎస్‌లోని ఎన్నారైల నుంచి వచ్చాయి. దీనికితోడు పలు కంపెనీల్లో ఉద్యోగులకు ఆర్‌ఎస్‌యూలు (రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు) ఇస్తాయి. ఈ స్టాక్ యూనిట్లు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని కూడా ఉద్యోగులు.. దాదాపుగా కుటుంబాలకే పంపుతుంటారు. తాజా బిల్లు ప్రకారం, ఇలా చేస్తే ఆర్‌ఎస్‌యూలు క్యాష్ చేసుకున్నప్పుడు కట్టే ట్యాక్సులకు అదనంగా 5 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అక్రమంగా డబ్బులు విదేశాలకు పంపే మార్గాలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కంపెనీలపై ప్రభావం..

యూఎస్‌లో ఉద్యోగాలు చేసే ఎన్నారైలు తమ వంతు ట్యాక్సులు కడుతూనే ఉంటారు. వాటికి అదనంగా ఈ 5 శాతం ట్యాక్సులు వేయడం వల్ల యూఎస్‌లో ఉద్యోగాల కోసం వచ్చే నిపుణుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. దీన్ని నిలువరించడానికి కంపెనీలు ఉద్యోగుల జీతాలు పెంచాల్సి రావొచ్చని నిపుణులు అంటున్నారు. ఇది ఆయా కంపెనీలకు పెద్ద సమస్యగా మారనుంది. ఇక ఆర్‌ఎస్‌యూల విషయంలోనూ ఇదే సమస్య. వీటిపై పడే ట్యాక్స్‌ను తగ్గించడానికి కంపెనీలు వేరే మార్గాలు వెతకాల్సి వస్తుంది.

వివక్ష కాక మరేంటి?

అలాగే ఈ బిల్లు వివక్షాపూరితంగా ఉందని కూడా పలువురు నిపుణులు మండిపడుతున్నారు. కేవలం అమెరికన్లు కాని వారి మీదనే ఈ 5 శాతం అదనపు పన్ను వేయడం వివక్ష కాకపోతే మరేంటని యూఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అమెరికన్లతోపాటు యూఎస్ అభివృద్ధిలో విదేశీయుల పాత్ర కూడా ఉందని, అలాంటి వారిపై ఇలా వివక్ష చూపించడం సరికాదంటున్నారు. కొంతకాలం క్రితం భారత్ వేస్తున్న సమానత్వపు సుంకాలను తప్పుబట్టిన యూఎస్‌.. ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ బిల్లు కేవలం ప్రతిపాదన స్టేజిలోనే ఉంది. అయితే దీనిలోని నిబంధనలు ఇప్పటికే యూఎస్‌లో స్థిరపడిన వలసదారులను, వారి కుటుంబాలను ఆందోళనలో పడేశాయి. మరి ఈ బిల్లుపై ట్రంప్ సర్కారు ముందుకెళ్తుందా? లేక ఏమైనా మార్పులు చేస్తుందా? చూడాలి.

Next Story