వీసా వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాపై నిఘా.. యూఎస్ ఎంబసీ వార్నింగ్!

by Phanindra |   (  Updated:2025-07-12 16:39:51  IST  )

వీసా దరఖాస్తు దారులకు భారత్‌లోని యూఎస్ ఎంబసీ కీలకమైన హెచ్చరిక చేసింది. వీసా వచ్చిన తర్వాత కూడా వారి సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని తెలిపింది.

వీసా వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాపై నిఘా.. యూఎస్ ఎంబసీ వార్నింగ్!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా చట్టాలు, ఇమిగ్రేషన్ రూల్స్ బ్రేక్ చేస్తే వీసా ఉన్న వారిని కూడా తమ దేశం నుంచి తరిమేస్తామని భారత్‌లోని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. డొనాల్డ్ ట్రంప్ ఆ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత యూఎస్ ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్ ఉంటుందని, వారు ఎప్పుడైనా అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారేమో చెక్ చేయాలని అమెరికా నిర్ణయించింది.

అలాంటి పోస్టులు ఏవైనా పెట్టి ఉంటే ఆ కారణంతో వీసా ఇవ్వరు. ఇదే పెద్ద సమస్య అని అందరూ భావిస్తున్నారు. అయితే వీసా వచ్చినా కూడా అలాంటి పోస్టులు పెడితే యూఎస్ నుంచి బహిష్కరిస్తారని ఎంబసీ చెప్తోంది. యూఎస్ వీసా దారులు ఎలాంటి చట్టాలు ఉల్లంఘించకుండా నిఘా ఉంటుందని, ఒకవేళ వాళ్లు రూల్స్ బ్రేక్ చేస్తే వీసా రద్దు చేసి వారిని డిపోర్ట్ చేసేస్తామని తేల్చిచెప్పింది. నాన్ ఇమిగ్రెంట్ ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ సోషల్ మీడియా ఖాతాలను ‘పబ్లిక్’లో పెట్టాలని, అప్పుడే వాటిని తాము చెక్ చేయగలుగుతామని ఇటీవలే యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

ఇక తాజాగా ఎంబసీ చేస్తున్న హెచ్చరికలను బట్టి చూస్తే.. యూఎస్ వీసా వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా ఖాతాలపై నిఘా కంటిన్యూ అవుతుందని అర్థం అవుతోంది. అలాగే సోషల్ మీడియా యాక్టివిటీ గురించి తప్పుడు సమాచారం ఇచ్చినా, పూర్తి సమాచారం ఇవ్వకపోయినా వీసా ఇవ్వకపోవడంతోపాటు శాశ్వతంగా అనర్హత వేటు వేస్తామని ఎంబసీ వార్నింగ్ ఇచ్చింది.

Next Story