- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US Embassy: గడువు తీరిందా.. బహిష్కరణ వేటు తప్పదు
గడువు దాటినప్పటికీ అమెరికాలో ఉంటున్నవారికి భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: గడువు దాటినప్పటికీ అమెరికాలో ఉంటున్నవారికి భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. నిర్దేశిత గడువుకు మించి అమెరికాలో ఉంటే బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించింది. ఉల్లంఘనకు పాల్పడితే కలిగే తీవ్ర పరిణామాలను స్పష్టంగా వెల్లడించింది. బహిష్కరణ ముప్పుతో పాటు భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఎంబసీ పోస్టు పెట్టింది. పర్యాటక, విద్యార్థి, వర్క్ పర్మిట్స్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తోన్న భారతీయులను ఉద్దేశించి ఈ హెచ్చరిక చేసింది. అయితే, ఏవైనా అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని వీడటంలో ఇబ్బందులు ఏర్పడితే.. చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
భవిష్యత్తులో గణనీయమైన ప్రభావం..
కాగా.. అమెరికా ప్రయాణంపై నిషేధం పడితే.. భవిష్యత్తులో అక్కడ చదువు, వృత్తివ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది. మరోవైపు, అమెరికాలో గడువుకు మించి ఉంటున్నవారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం గతంలో హెచ్చరికలు చేసింది. అంతేకాదు.. ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు అధికంగా ఉంటే రోజుకు 998 డాలర్లు ఫైన్, సొంతంగా వెళ్లిపోకపోతే 1,000 నుంచి 5000 డాలర్ల ఫైన్ విధించనున్నారు. జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.






