US Strikes: మాట వినకపోతే దాడులు తీవ్రతరం: ట్రంప్ ప్రకటన

by S Gopi |

తెహ్రాన్ శాంతి దిశగా ఆలోచించకపోతే దాడులను తీవ్రతరం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

US Strikes: మాట వినకపోతే దాడులు తీవ్రతరం: ట్రంప్ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: అనుకున్నట్టే అయింది. అణ్వాయుధాల తయారీ విషయంలో తగువుకు దిగిన ఇజ్రాయెల్-ఇరాన్ మధ్యలోకి అమెరికా ప్రత్యక్షంగా తలదూర్చింది. ఇరాన్‌కు చెందిన మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్‌లో ఉన్న ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ కేంద్రాలపై దాడి చేశామని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేశాం. అమెరికా వాయుసేనలు బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఫోర్దోపై పూర్తిస్థాయిలో దాడి చేశాయి. ఈ సాహాసోపేత ఆపరేషన్‌ను విజయవంతంగా చేపట్టిన తమ సైనికులకు అభినందనలు. ఇలాంటి ఆపరేషన్‌ ప్రపంచంలో మరే దేశ సైన్యానికి కూడా సాధ్యమవదని గర్వంగా చెబుతున్నాను అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. ఇరాన్‌పై జరిపిన దాడులను చారిత్రక క్షణాలని అన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలోని దేశాలను ఇరాన్ అణు ముప్పు ద్వారా భయపెట్టాలని చూస్తోంది. ఇలాంటి సమయంలో అక్కడ శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ఇరాన్‌దే. ఇరాన్‌లో మరిన్ని లక్ష్యాలు మిగిలున్నాయి. తెహ్రాన్ శాంతి దిశగా ఆలోచించకపోతే దాడులను తీవ్రతరం చేస్తామని, వాషింగ్టన్, టెల్ అవీవ్ కలిసి పనిచేస్తాయని అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా ఒక టీమ్‌లా పనిచేశాయని, ఇజ్రాయెల్ సైన్యాన్ని ప్రశంసిస్తూనే ఆ దేశ ప్రధాని నెతన్యాహుకు కృతజ్ఞతలు చెప్పారు.

చెప్పిన సమయం కంటే ముందే

ఇరాన్‌పై దాడికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్‌ మొదట ఆ దేశానికి రెండు వారాల గడువు ఇచ్చారు. ఇజ్రాయెల్-ఇరాన్ వ్యవహారంలో నేరుగా తలదూర్చడంపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. కానీ, సహజంగానే దుందుడుకుగా నిర్ణయాలు తీసుకునే ట్రంప్ ఆలోపే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు నిర్వహించారు.

నెతన్యాహు కృతజ్ఞతలు

ఇరాన్‌పై దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్‌లో ఉన్న మూడు అణు కేంద్రాలపై అమెరికా బీ2 స్పిరిట్ బాంబర్లను ప్రయోగించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కృతజ్ఞతలు చెప్పారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ చరిత్రను మార్చగలదని, ఆపరేషన్ రైజింగ్ లయన్ ద్వారా ఇజ్రాయెల్ అద్భుతమైన ప్రయోజనాలను పొందింది. తాజా యూఎస్ దాడులు భూమిపై మరే దేశం కూడా చేయలేని సాహసం చేశాయని ప్రకటించారు.

అమెరికాలో హైఅలర్ట్

ఇరాన్‌లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిన తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని ముఖ్యమైన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలకు హానీ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సున్నితమైన చోట్ల, ప్రార్థనా స్థలాలపై అక్కడి ప్రభుత్వం నిఘా పెంచింది. వాషింగ్టన్, న్యూయార్క్, లాస్ ఏంజెలెస్ సహా ముఖ్యమైన నగరాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. జన సమూహాల వద్ద భద్రతను పెంచారు.

స్పందించిన ప్రపంచ దేశాలు

శనివారం రాత్రి ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడిపై ప్రపంచాధినేతలు స్పందించారు. గత 24 గంటల్లో జరిగిన పరిణామాలను గమనిస్తున్నామని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ అన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సైనిక చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింత తీవ్రతరం కాకుండా నివారించాలి. దౌత్య ప్రయత్నాలకు న్యూజిలాండ్ మద్దతిస్తుంది. అన్ని దేశాలు చర్చకు రావాలని కోరుతున్నామని అన్నారు. ఇజ్రాయెల్ కోరినట్టు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల దాడిని బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా ఖండించింది. మరో దేశం మెక్సికో విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాలని, ఈ ప్రాంతంలో శాంతియుత చర్చలు జరగాలని, శాంతి కోసం దౌత్య చర్చలకు పిలుపునిస్తున్నామని ప్రకటించింది.

Next Story