- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యసభలో ఇండిగో సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్
ఇండిగో సంక్షోభంపై రాజ్యసభ వేదికగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సమస్య ఇండిగో సంస్థలోని సిబ్బంది కేటాయింపు (Crew Rostering), అంతర్గత ప్రణాళిక లోపాల వల్లే తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: గడిచిన ఏడు రోజులుగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంక్షోభం (IndiGo Airlines crisis) కారణంగా వందలాది విమానాలు రద్దు అయిన విషయం తెలిసిందే. విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇండిగో సంక్షోభంపై రాజ్యసభ వేదికగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu) స్పందించారు. ఈ సమస్య ఇండిగో సంస్థలోని సిబ్బంది కేటాయింపు (Crew Rostering), అంతర్గత ప్రణాళిక లోపాల వల్లే తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 1న విమాన సిబ్బంది పని వేళల (FDTL) నిబంధనలపై ఇండిగో తో సమావేశం నిర్వహించామని, అప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నట్లు వారు చెప్పలేదని, అంతా సవ్యంగానే ఉందని అన్నారని మంత్రి గుర్తు చేశారు.
కానీ డిసెంబర్ 3న హఠాత్తుగా ఈ సమస్యలు బయటపడ్డాయని, వెంటనే తమ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితిని పర్యవేక్షించిందని సభలో వివరించారు. ఈ ఘటన వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదని మంత్రి తెలిపారు. దీనిపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. భవిష్యత్తులో ఏ విమానయాన సంస్థ అయినా నిబంధనలు ఉల్లంఘిస్తే, వారికి గుణపాఠం చెప్పేలా, పరిశ్రమ మొత్తానికి ఒక ఉదాహరణగా నిలిచేలా చర్యలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. సివిల్ ఏవియేషన్ రంగంలో నిబంధనల పట్ల రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.






