కేంద్రం కీలక నిర్ణయం: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు

by Gantepaka Srikanth |

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర మంత్రిమండలి (Union Cabinet) కీలక ఆమోదం తెలిపింది.

కేంద్రం కీలక నిర్ణయం: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర మంత్రిమండలి (Union Cabinet) కీలక ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తితో (CJI) కలిపి ఉన్న 34 మంది న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం కోసం ప్రభుత్వం త్వరలోనే పార్లమెంటులో 'సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026'ను ప్రవేశపెట్టనుంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 92,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, న్యాయ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2019లో చివరిసారిగా న్యాయమూర్తుల సంఖ్యను 31 నుండి 34కి పెంచారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాజ్యాంగ అధికారం..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(1) ప్రకారం, పార్లమెంటు చట్టం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం కేంద్రానికి ఉంటుంది. కేసుల సంఖ్య, పనిభారాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఈ సంఖ్యను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్న తరుణంలో, కొత్తగా సీట్ల సంఖ్యను పెంచడం వల్ల న్యాయవ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని మరియు సామాన్యులకు త్వరితగతిన న్యాయం అందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story