Sri Lanka: ఢిల్లీలోని శ్రీలంక రాయబారికి సమన్లు

by Shamantha N |

భారత మత్స్యకారులపై శ్రీలంక (Sri Lanka) నేవీ కాల్పులు జరపడం కలకలం రేగింది. దీనిపైన భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది.

Sri Lanka: ఢిల్లీలోని శ్రీలంక రాయబారికి సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత మత్స్యకారులపై శ్రీలంక (Sri Lanka) నేవీ కాల్పులు జరపడం కలకలం రేగింది. దీనిపైన భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో ఐదుగురు జాలర్లకు గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపైన తీవ్ర నిరసన తెలుపుతూ ఢిల్లీలోని శ్రీలంక రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది. మత్స్యకారుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని వారి సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. ఆ విధానాన్నే భారత్‌ ఎల్లప్పుడూ కోరుకుంటోందంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బలప్రయోగం చేయడం ఆమోదయోగ్యం కాదని మరోసారి తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఇరు ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న అవగాహన ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. అంతేకాకుండా, కొలంబోలోని భారత హైకమిషన్‌ కూడా ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగశాఖ ముందు లేవనెత్తినట్లు తెలిపింది.

అసలేం జరిగిందంటే?

ఇకపోతే, శ్రీలంక తీరంలోని డెల్ఫ్ట్ దీవికి సమీపంలోకి వెళ్లిన 13 మంది భారత జాలర్లను అక్కడి నౌకాదళం అడ్డుకుంది. తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన వీరిని అరెస్టు చేస్తున్న సమయంలో పలువురు తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీంతో వారిపై శ్రీలంక నావికాదళం కాల్పులు జరిపింది. ఆ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జాఫ్నా ఆసుపత్రిలో చేర్చించారు. స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురితో పాటు మిగతావారందర్నీ శ్రీలంక పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే జాఫ్నాలోని భారత కాన్సులేట్‌ అధికారులు ఆస్పత్రికి వెళ్లి గాయపడిన జాలర్లను పరామర్శించారు.

Next Story