US-China : అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం

by S Gopi |

చైనా, యూఎస్ మధ్య సుంకాల పెంపు ఇదే స్థాయిలో కొనసాగితే, వివిధ దేశాల మధ్య వాణిజ్యంలో 80 శాతం క్షీణత ఏర్పడుతుంది

US-China : అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై  తీవ్ర ప్రభావం
X

దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్, చైనా మధ్య జరుగుతున్న 'టిట్-ఫర్-టాట్' టారిఫ్‌ ధోరణి అభివృద్ధి చెందుతున్న దేశాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నారు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థల ఉమ్మడి ఏజెన్సీ అధిపతి పమేలా కోక్ హామిల్టన్.. 'వాణిజ్య యుద్ధం, సుంకాల పెంపు కారణంగా ఇప్పటికే కోత పడిన విదేశీ సహాయానికి మరింత దెబ్బ తీస్తుంది. అది మరింత దారుణం. చైనా, యూఎస్ మధ్య సుంకాల పెంపు ఇదే స్థాయిలో కొనసాగితే, వివిధ దేశాల మధ్య వాణిజ్యంలో 80 శాతం క్షీణత ఏర్పడుతుంది. మొత్తంగా ప్రపంచ వాణిజ్యంపై పడే ప్రభావం విపత్తుగా పరిణమించగలదని' అన్నారు.

విదేశీ సహాయాన్ని తొలగించడం కంటే సుంకాలు చాలా హానికలిగిస్తాయని ఆమె హెచ్చరించాడు. ఎందుకంటే ఈ వాణిజ్య యుద్ధం కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రపంచ వాణిజ్యం కనీసం 3-7 శాతం మేర దెబ్బతినవచ్చు. ఫలితంగా ప్రపంచ జీడీపీ 0.7 శాతం పతనమవుతుందని, ఇందులోనూ అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువ ప్రభావితం అవుతాయన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ దుస్తుల ఎగుమతులను ఉదహరించిన పమేలా హామిల్టన్.. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ ఉమ్మడి సంస్థ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం(ఐటీసీ) అంచనాల ప్రకారం, అమెరికా 37 శాతం సుంకాలు విధించడం వల్ల ఆ దేశానికి 3.3 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 28.40 వేల కోట్ల) నష్టాలను చూస్తాయి. ఇవి ట్రేడ్ సెంటర్ సేకరించిన డేటా ఆధారంగా అంచనా వేసిన నష్టం. వాస్తవంలో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంతే చైనాపై అమెరికా విధించే 145 శాతం పన్ను, ప్రతిగా చైనా అమెరికాపై విధించిన 125 శాతం సుంకాలు, 90 రోజుల సుంకం తాత్కాలిక విరామం పరిణామాలను లెక్కించలేదని ఆమె వివరించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం

ఆర్థిక మాంద్యం ఎదుర్కొన్న తరువాత, ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంకకు తాజా పరిణామాలు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రీలంక ఉత్పత్తులపై 44 శాతం సుంకాన్ని విధించారు. ఇది శ్రీలంక మార్కెట్లను మరింత కృంగదీస్తుంది. ఎందుకంటే, శ్రీలంకకు అమెరికా అతిపెద్ద మార్కెట్. ఆ దేశ 12 బిలియన్ డాలర్ల సరుకుల ఎగుమతులలో దాదాపు నాలుగింట ఒక వంతు వాటా అమెరికాదే. అదేవిధంగా మారిషస్, మడగాస్కర్, లెసోతో, దక్షిణాఫ్రికా ఈ జాబితాలో ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటాయని గ్లోబల్ థింక్-ట్యాంక్‌ ఛాథమ్ హౌస్ ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరెక్టర్ అలెక్స్ వైన్స్ అన్నారు.

Next Story