- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిమశిఖరంపై భారతీయుల సరికొత్త రికార్డు.. అంతలోనే ముంచేసిన తీవ్ర విషాదం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం తిరిగి కిందకు దిగుతుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అనంతరం తిరిగి కిందకు దిగుతుండగా ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందారు. మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తించారు. శిఖరాగ్రం నుండి కిందకు వస్తున్న సమయంలో తీవ్ర అలసటకు గురైన వీరిని కాపాడేందుకు గైడ్లు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఎక్స్పైడిషన్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (EOAN) జనరల్ సెక్రటరీ రిషి భండారీ తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్ ఆరే బుధవారం, అర్జుణ్ కుమార్ తివారీ గురువారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఎవరెస్ట్ (8,848.86 మీటర్లు) శిఖరాన్ని చేరుకున్నారు. అయితే, తిరిగి కిందకు దిగుతున్న క్రమంలో గురువారం సందీప్ ఆరే మరణించగా, అరుణ్ కుమార్ తివారీ ఏ సమయంలో మృతి చెందారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గైడ్లు వారి ప్రాణాలు కాపాడేందుకు ఎంతో శ్రమించారని, కానీ తీవ్ర శారీరక క్షీణత కారణంగా వారు తుది శ్వాస విడిచారని భండారీ పేర్కొన్నారు. ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఈ సీజన్లో బుధవారం ఒక్కరోజే సందీప్‌తో పాటు మరో ఇద్దరు భారతీయులు (తులసి రెడ్డి పల్పునూరి, అజయ్ పాల్ సింగ్ ధలివాల్) సహా రికార్డు స్థాయిలో 274 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో శిఖరాన్ని చేరుకోవడం ఒక సరికొత్త రికార్డు. ఆ మరుసటి రోజే గురువారం భారత్‌కు చెందిన లక్ష్మీకాంత మండల్ కూడా ఎవరెస్ట్‌ను అధిరోహించారు. ఈ సంతోషం నిండక ముందే ఇద్దరు భారతీయ పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోవడం పర్వతారోహణ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.






