పహల్గామ్ లో ఘోర ప్రమాదం.. టూరిస్ట్ కపుల్ మృతి

by Naga Rani Yarlagadda |

పహల్గామ్ - అనంత్ నాగ్ మార్గంలో వెళ్తున్న టూరిస్ట్ వెహికల్ లోయలోకి దూసుకెళ్లడంతో.. దంపతులు మృతి చెందారు.

పహల్గామ్ లో ఘోర ప్రమాదం.. టూరిస్ట్ కపుల్ మృతి
X

దిశ, వెబ్‌‌‌‌డెస్క్ : సౌత్ కాష్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహల్గామ్ నుంచి అరువైపు పర్యాటకులతో వెళ్తున్న తవేరా వాహనం (JK21A-0379) అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గుజరాత్ కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతి చెందగా.. మరో ఇద్దరితో పాటు డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రంగ్‌వర్డ్ లారీపోరా నివాసి మహ్మద్ మక్బూల్ భట్ కుమారుడు రయీస్ అహ్మద్ భట్ ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. ప్రమాదంలో మరణించినవారిని గుజరాత్ కు చెందిన దంపతులు బావిన్ భావ్ సర్, అతని భార్య అవ్ని భావ్ సర్ లుగా గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే బావిన్ భావ్‌సర్‌ను పహల్గామ్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అతని భార్య అవ్ని భావ్‌సర్ ఎడమ కాలుకు తీవ్ర గాయాలై, రక్తస్రావం కావడం వల్ల చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంలో గాయపడిన మిగిలిన ఇద్దరు పర్యాటకులు గుజరాత్‌కు చెందిన నైనా బెన్, అశోక్ భాయ్‌లుగా గుర్తించారు. వీరిద్దరికీ ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం వారిని పెద్ద ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన వాహన డ్రైవర్ రయీస్ అహ్మద్ భట్‌ను చికిత్స నిమిత్తం అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC) కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న కాశ్మీర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story