శబరిమల బంగారం వివాదంలో ట్విస్ట్

by Muthe.Rajitha |

శబరిమల ఆలయంలో బంగారు తాపడాల బరువు తగ్గిన ఉదంతం కీలక మలుపు తిరిగింది.

శబరిమల బంగారం వివాదంలో ట్విస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : శబరిమల ఆలయంలో బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టీ ఆలయంలోని బంగారు తాపడాల నుంచి వేరు చేసిన 476 గ్రాముల బంగారాన్ని అమ్ముకున్నట్టు రుజువైంది. ఆలయం నుంచి తీసుకువచ్చిన బంగారు తాపడాలని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్‌లో వేరు చేసి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన బంగారం వ్యాపారి గోవర్ధన్‌కు విక్రయించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో బయట పడింది. నిందితుడు గోవర్ధన్ కూడా ఈ నేరాన్ని అంగీకరించగా, సిట్ అధికారులు అతడికి సమన్లు జారీ చేసారు. అనంతరం ఉన్నికృష్ణన్‌ను తీసుకుని బెంగళూరుకు బయల్దేరారు.

ఉన్నికృష్ణన్ 2004-2008 మధ్య శబరిమల ఆలయంలో పూజారి సహాయకుడిగా పనిచేసినపుడు, 1998లో ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడాల గురించి తెలుసుకున్నాడు. బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన అతడు, 2019లో తాపడాలకు మెరుగులు దిద్దే పనిని తనకు అప్పగించాలని కోరాడు. ఆ పనిని పొందిన అనంతరం వాటిని చెన్నైకి తీసుకెళ్లి బంగారాన్ని తొలగించి విక్రయించాడు. తిరిగి అమర్చిన తాపడాల బరువు తగ్గిన విషయం ఇటీవల బయటపడగా... సిట్ ఈ కేసులో ఉన్నికృష్ణన్‌తో పాటు ఆలయ బోర్డు మాజీ అధికారి మురారీ బాబును కూడా అరెస్టు చేసింది. కొట్టేసిన బంగారాన్ని రికవరీ చేస్తామని సిట్ అధికారులు పేర్కొన్నారు.

Next Story