ఎన్డీఏతో పొత్తుపై TVK చీఫ్ విజయ్ స్పష్టత

by Gantepaka Srikanth |

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణం మొదలవ్వకముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఎన్డీఏతో పొత్తుపై TVK చీఫ్ విజయ్ స్పష్టత
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణం మొదలవ్వకముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అధినేత, దళపతి విజయ్ తన రాజకీయ పంథాను స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే (NDA) కూటమితో పొత్తు ఉంటుందన్న ఊహాగానాలకు తెరదించుతూ, 234 నియోజకవర్గాల్లో తన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని విజయ్ తేల్చిచెప్పారు. గతకొన్ని రోజులుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయ్‌ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, విజయ్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. విజయ్ తన ప్రసంగాల్లో బీజేపీని ‘సైద్ధాంతిక శత్రువు’గా, డీఎంకేను ‘రాజకీయ ప్రత్యర్థి’గా అభివర్ణించారు.

తమిళ ఎన్నికలపై విజయ్ ప్రభావం ఎంత?

విజయ్ ఎంట్రీతో తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే - ఏఐఏడీఎంకే ద్వంద్వ పోరాటం ఇప్పుడు త్రిముఖ పోటీగా మారే అవకాశం ఉంది. విజయ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఓట్ల రూపంలో మారితే, రాష్ట్రంలోని 15% నుండి 18% ఓట్లు ఆయన ఖాతాలో పడే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. విజయ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. ఇది పరోక్షంగా అధికార డీఎంకేకు లాభం చేకూరుస్తుందా లేదా ఏఐఏడీఎంకే పుంజుకోవడానికి అడ్డుపడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. చెన్నై వంటి నగరాల్లో విజయ్ పార్టీ రెండో అతిపెద్ద శక్తిగా అవతరించే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

Next Story