సౌత్ ఇండియాపై బీజేపీ బిగ్ స్కెచ్.. టీవీకేతో బీజేపీ పొత్తు?

by Prasad Jukanti |

అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి.

సౌత్ ఇండియాపై బీజేపీ బిగ్ స్కెచ్.. టీవీకేతో బీజేపీ పొత్తు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాలు మరోసారి హీటెక్కుతున్నాయి. ఈ ఏడాది జరగబోయే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న తమిళనాడుపై (Tamil Nadu Politics) బీజేపీ, కాంగ్రెస్‍ వంటి జాతీయ పార్టీలతో పాటు అక్కడి అధిాకర డీఎంకే ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ యాక్టర్ విజయ్ పార్టీ టీవీకే (Vijay TVK Party) చుట్టూ తమిళ రాజకీయం చర్చనీయాశంగా మారుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‍గా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన విజయ్ తన పార్టీని గెలిపించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టీవీకే ఎవరితోనైనా జట్టు కలుస్తుందా లేక ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీవీకేతో పొత్తు విషయంలో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ సీరియస్‍గా పరిశీలిస్తున్నట్లు తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా?:

టీవీకే పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత విజయ్ తమిళనాడులోని అధికార డీఎంకేను టార్గెట్ చేస్తున్నారు. సీఎం స్టాలిన్‍ను అంకుల్ అని సంబోధిస్తూనే తన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలంటూ పొలిటికల్‍గా నిలదీస్తున్నారు. విజయ్ సభలకు ప్రజల వైపు నుంచి భారీగా మద్దతు కూడా వస్తోంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో విజయ్ పార్టీ కీ రోల్ పోషించడంలో ఎలాంటి సందేహాలు లేవనే టాక్ వినిపిస్తున్నది. దీంతో విజయ్ పార్టీని ఎలాగైనా తమ వైపు తిప్పుకునేందుకు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తమిళ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో జెండా పాతడం ద్వారా దక్షిణభారత దేశంలో తమ దమ్మేంటో తిరిగి చాటాలని బీజేపీ (BJP) భావిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అన్ని అంశాలను సీరియస్‍గా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీలో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పోటీ చేయడం మాత్రమే కాదు గెలవడంపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పొత్తుల అంశాన్ని సైతం కీలకంగా ప్రస్తావించారని డీఎంకే వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్‍ను తమ వైపు ఆకర్షించేలా బీజేపీ సీరియస్ గా పరిశీలిస్తోందని తమిళనాడు రాజకీయ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది.

కాంగ్రెస్ మా సహజ మిత్రుడు: విజయ్ పార్టీ

ఇదిలా ఉంటే కాంగ్రెస్ (Congress) పార్టీ మా సహజ మిత్రుడు అంటూ ఇటీవల టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ లౌకికవాదం, మతత్వానికి వ్యతిరేకంగా వారి వైఖరి విషయంలో కాంగ్రెస్, టీవీకే సహజ మిత్రపక్షాలు. ఆ కోణంలో మేము ఎల్లప్పుడూ సహజ భాగస్వాములమై రాహుల్ గాంధీ, మా నాయకుడు విజయ్ కూడా స్నేహితులే అనే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విజయ్ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో టీవీకే విషయంలో బీజేపీ సైతం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోందని జాతీయ మీడియాలో కథనాలు రావడం సౌత్ ఇండియా పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది.

Next Story