చైనాకు ట్రంప్ బంపర్ ఆఫర్.. టారిఫ్స్ తగ్గిస్తానని హామీ

by Muthe.Rajitha |

నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న చైనా, అమెరికా మధ్య స్నేహం చిగురిస్తున్నట్టు కనిపిస్తోంది.

చైనాకు ట్రంప్ బంపర్ ఆఫర్.. టారిఫ్స్ తగ్గిస్తానని హామీ
X

దిశ, వెబ్ డెస్క్ : నిన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న చైనా, అమెరికా మధ్య స్నేహం చిగురిస్తున్నట్టు కనిపిస్తోంది. అమెరికా-చైనా (US-China)ల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ ఇరు దేశాల అధినేతలు డొనాల్డ్‌ ట్రంప్‌, షీ జిన్‌పింగ్‌ల భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దక్షిణ కొరియా వేదికగా వీరిద్దరూ గురువారం భేటీ (Trump-Jinping Meeting) అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వీరు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు.

జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు, చైనా (China)పై టారిఫ్‌లను 10శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఫెంటనిల్‌ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీంతో మొత్తం టారిఫ్‌లు 57శాతం నుంచి 47శాతానికి దిగి రానున్నాయి. ఇక, అమెరికా సోయాబీన్‌ ఉత్పత్తుల కొనుగోళ్లను తక్షణమే పునరుద్ధరించేందుకు చైనా అంగీకరించింది. అలాగే అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని తెలుస్తోంది.

ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదరనున్నట్లు ట్రంప్‌ సంకేతాలిచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనాలో పర్యటిస్తానని, ఆ తర్వాత వీలు చూసుకుని జిన్‌పింగ్‌ కూడా అమెరికాకు వస్తారని ట్రంప్ అన్నారు.

Next Story