Trump: అణు ఒప్పందం కుదరకపోతే బాంబు దాడులు చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

by B.Srinivas |

ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబు దాడులు చేస్తామని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Trump: అణు ఒప్పందం కుదరకపోతే బాంబు దాడులు చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ (Iran) తన అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే బాంబు దాడులు చేస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. అంతేగాక ఇరాన్‌పై అదనపు సుంకాలు (Tarrifs) సైతం విధిస్తామని హెచ్చరించారు. తాజాగా ఆయన ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఈ ఒప్పందానికి వారు అంగీకరించకపోతే తప్పకుండా దాడులు జరుగుతాయి. ఇది ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాలుగేళ్ల క్రితం చేసినట్టుగా భారీగా సుంకాలను విధించే అవకాశం కూడా ఉంది’ అని తెలిపారు.

ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, కానీ ప్రస్తుతానికి ఈ విషయంపై వివరాలు వెల్లడించలేనని తెలిపారు. అమెరికాతో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ తిరస్కరించిందని ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ (Pezishkiyan) ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, ఇరాన్ అణు కార్యకలాపాల కారణంగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలో కఠినమైన ఆంక్షలు విధించారు. అంతేగాక అణు ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందంపై ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

Next Story