Trump: భారతీయులపై ట్రంప్ కొరడా.. ప్రతిరోజూ 8 మంది బహిష్కరణ

by B.Srinivas |

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Trump: భారతీయులపై ట్రంప్ కొరడా.. ప్రతిరోజూ 8 మంది బహిష్కరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అక్రమ వలసదారులపై కఠిన నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ప్రతి రోజూ దాదాపు 8 మంది ఇండియన్స్ యూఎస్ నుంచి బహిష్కరణకు గురవుతున్నట్టు ఓ నివేదికలో వెల్లడైంది. ఈ సంఖ్య బైడెన్ ప్రభుత్వం కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. మాజీ ప్రెసిడెంట్ బైడెన్ పదవీ కాలంలో 3 ప్రతి రోజూ ముగ్గురు భారతీయులు డిపోర్ట్ అయ్యారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు అమెరికా మొత్తం 1,703 మంది భారతీయులను బహిష్కరించింది. వారిలో పంజాబ్‌కు చెందిన 620 మంది ఉండగా, హర్యానా నుంచి 604, గుజరాత్ 245, ఉత్తరప్రదేశ్ 38, గోవాకు చెందిన 26 మంది ఉన్నారు.

333 మందిని సైనిక విమానాల ద్వారా పంపించగా.. 231 మందిని చార్టర్ విమానాల ద్వారా, 300 మందిని డీహెచ్ఎస్ చార్టర్ ప్లైట్‌ల ద్వారా, 72 మందిని పనామా నుంచి, 767 మందిని అమెరికా నుంచి వాణిజ్య విమానాల ద్వారా పంపించారు. మొత్తం బహిష్కరణకు గురైన వారిలో 1,562 మంది పురుషులు, 141 మంది మహిళలు ఉన్నారు. ‘వ్యక్తుల జాతీయతను నిర్ధారించిన తర్వాతే బహిష్కరణలు జరుగుతాయి. అమెరికా అధికారులు బహిష్కరించాల్సిన వ్యక్తుల జాబితాలను మాకు అందిస్తారు. అనంతరం భారత్ వారి నేషనాలిటీని ధ్రువీకరిస్తుంది’ అని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

Next Story