Trump: 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్

by S Gopi |

ఇటీవల కొలరాడోలో యూదులపై జరిగిన దాడి నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Trump: 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: జాతీయ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 దేశాలకు చెందిన ప్రయాణికులు అమెరికాకు వెళ్లకుండా నిషేధం విధించారు. ఈ నిషేధ ఉత్తర్వులపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారని వైట్‌హౌస్ ప్రకటించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న ట్రంప్, తాజా నిర్ణయంతో మరింత షాక్‌కు గురిచేసింది. 12 దేశాలపై నిషేధం విధించడమే కాకుండా, మరో ఏడు దేశాలపై పాక్షిన నిసేధం ఉంటుందని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఇటీవల కొలరాడోలో యూదులపై జరిగిన దాడి నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిషేధం విధించిన దేశాల జాబితాలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమన్, మయన్మార్, కాంగో, చాద్, హైతీ, ఈక్వెటోరియల్ గినియా, లీయా, ఎరిత్రియా, సూడాన్, సోమాలియా దేశాలున్నాయి. ఇక, క్యూబా, తుర్కమెనిస్తాన్, వెనెజులా, బురుండి, లావోస్, టోగో, సియెర్రా లియోన్ దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. ఈ బ్యాన్ జూన్ 9 నుంచి అమల్లోకి వస్తుందని వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు.

'మాకు హాని కలిగించాలనుకునే వ్యక్తులను మా దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించము' అని ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నిషేధం జాబితాలో మరిన్ని దేశాలు చేర్పు, తొలగింపు ఉండోచ్చని ఆయన అన్నారు. దేశానికి హానీ కలిగించే విదేశీయుల నుంచి అమెరికన్లను కాపాడతానని అధ్యక్షుడు ట్రంప్ మాటిచ్చారని, దాన్ని నిలబెట్టుకున్నట్టు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. సరైన భద్రతా తనిఖీలు, వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉండటం, గుర్తింపు సమాచారాన్ని ఇవ్వని కొన్ని దేశాల కోసమే ఈ ఆంక్షలు విధించినట్టు చెప్పారు.

హార్వర్డ్ యూనివర్శిటీ టార్గెట్

కొన్ని దేశాలపై నిషేధంతో పాటు హార్వర్డ్ యూనివర్శిటీకి సంబంధించి ట్రంప్ కొత్తగా మరో కీలక ఉత్తర్వుపై సంతకం చేశారు. హార్వర్డ్‌లో చదవాలని భావించే విదేశీ విద్యార్థుల వీసాలను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు హానీ కలిగించే వారు తమకు వద్దని, హార్వర్డ్ యూనివర్శిటీ అటువంటి విద్యార్థులకు కేంద్రంగా మారిందని అన్నారు. ఈ ఉత్తర్వులు హార్వర్డ్‌కే పరిమితమని, అమెరికాలోని ఇతర యూనివర్శిటీలకు వర్తించవని వైట్‌హౌస్ పేర్కొంది.

Next Story