- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. 'భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం నెదర్లాండ్స్‌లోని (Netherlands) హేగ్‌లో జరిగిన నాటో (NATO) శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సహా ప్రపంచంలో చోటుచేసుకున్న అనేక యుద్ధ స్థితులను తానే అడ్డుకున్నానని, వాటిని శాంతియుత మార్గాల్లో పరిష్కరించానని గర్వంగా ప్రకటించారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య యుద్ధ పరిస్థితిని తానే ఆపానని మరోసారి వ్యాఖ్యనించారు. ఇరు దేశాధినేతలకు వరుస ఫోన్ కాల్స్ చేసి 'మీరు ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తే, అమెరికా ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేయదు' అని హెచ్చరించానని పేర్కొన్నారు. ఇదే కారణంగా ఉభయ దేశాలు శాంతి మార్గాన్ని ఎంచుకున్నాయని, తాను అణు యుద్ధాన్ని అడ్డుకున్నానని చెప్పారు.
కాగా, జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం మే 7న 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మే 10న రెండు దేశాలు సీజ్‌ఫైర్ ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి. దీన్ని తన సారధ్యంతో సాధించానని ఆ సమయంలోనే ట్రంప్ చెప్పగా, భారత్ మాత్రం దీనిని ఖండించింది. పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) తన భారత అధికారిని ఫోన్ చేసి, శత్రుత్వ చర్యలను నిలిపివేయాలని స్వయంగా అభ్యర్థించాడని తెలిపింది.
ఇక ట్రంప్ తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం 18వ సారి అంటూ ఎక్స్ వేదికగా మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. మోడీ తన స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడడని ఆరోపించింది. అయితే, ట్రంప్ తాజా వ్యాఖ్యలపై మోడీ ప్రభుత్వం కానీ, అధికార బీజేపీ నాయకులు కానీ స్పందించలేదు.






