యూరప్ దేశాలపై సుంకాలు.. గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ కొత్త ప్లాన్

by Phanindra |

గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ కొత్త ప్లాన్ వేశారు. యూరప్ దేశాలపై సుంకాలు వేస్తున్నట్లు ప్రకటించారు.

యూరప్ దేశాలపై సుంకాలు.. గ్రీన్‌లాండ్ కోసం ట్రంప్ కొత్త ప్లాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: గ్రీన్‌లాండ్ విషయంలో తనకు ఎదురు చెప్పిన దేశాలపై కూడా సుంకాలు వేస్తానన్న బెదిరింపులను యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నిజం చేశారు. యూరప్ దేశాలపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10 శాతం సుంకాలు వేస్తున్నట్లు ప్రకటించారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్ దేశాలపై ఈ టారిఫ్‌లు వేస్తున్నట్లు తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ వెల్లడించారు. గ్రీన్‌లాండ్‌పై ఎలాంటి ఒప్పందం చేసుకోకపోతే జూన్ 1 నుంచి ఈ సుంకాలను 25 శాతానికి పెంచుతానని ఆయన హెచ్చరించారు. శతాబ్దాలుగా యూరప్ దేశాలకు అమెరికా సబ్సిడీలు ఇస్తూ వస్తోందని, వాటికి డెన్మార్క్ ఇప్పుడు రుణం తీర్చుకోవాలని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడేందుకు ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎలాంటి ప్రశ్నలు లేకుండా త్వరగా పరిష్కరించాలి. అందుకే ఈ యూరప్ దేశాల నుంచి యూఎస్‌కు వచ్చే ఉత్పత్తులపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం సుంకాలు వేస్తున్నా. జూన్ 1 నుంచి వీటిని 25 శాతానికి పెంచుతా’ అని ట్రంప్ ప్రకటించారు.

రష్యా, చైనా దేశాలు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించేందుకు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని, ఆ ప్రాంతాన్ని డెన్మార్క్ కాపాడుకోలేదని ట్రంప్ అన్నారు. అందుకే ఈ విషయంలో డీల్ చేసుకోవడం ముఖ్యమని, పూర్తిగా గ్రీన్‌లాండ్‌ను కొనే డీల్ పూర్తయ్యే వరకు ఈ సుంకాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. 150 ఏళ్లుగా గ్రీన్‌లాండ్ కోసం యూఎస్ ప్రయత్నిస్తోందని ట్రంప్ గుర్తుచేశారు. కానీ గత ప్రెసిడెంట్లు చేసిన ప్రయత్నాలను డెన్మార్క్ అడ్డుకుందన్నారు. అలాగే చాలా యూరప్ దేశాలు కూడా బయటకు చెప్పని కారణాలతో పలుమార్లు గ్రీన్‌లాండ్‌ను సందర్శించాయని, కాబట్టి ఇది మొత్తం భూగ్రహం భద్రతకు ముప్పని హెచ్చరించారు. తమ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ రక్షణ వ్యవస్థను ప్రభావవంతంగా పూర్తిచేయాలంటే గ్రీన్‌లాండ్ చాలా ముఖ్యమని, ఈ విషయంలో డెన్మార్క్‌ సహా ఇతర దేశాలతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టంచేశారు.

Next Story