ముదురుతున్న ట్రంప్-మస్క్ ఫైట్.. కాల్ మాట్లాడేందుకు ట్రంప్ తిరస్కరణ

by Phanindra |   (  Updated:2025-06-07 01:44:45  IST  )

ట్రంప్-మస్క్ మధ్య ట్వీట్ ఫైట్ ముదురుతోంది. మస్క్‌తో కాల్ మాట్లాడేందుకు ట్రంప్ తిరస్కరించారు.

ముదురుతున్న ట్రంప్-మస్క్ ఫైట్.. కాల్ మాట్లాడేందుకు ట్రంప్ తిరస్కరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: అగ్రరాజ్యం అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం పెట్రేగిపోతోంది. ఇటీవల ట్రంప్ సర్కారు తీసుకొచ్చిన ట్యాక్స్‌ బిల్లు వల్లనే వీళ్లిద్దరి స్నేహం దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ బిల్లు అంతా డొల్ల అని, దీనికి ఓటేసిన వారంతా తప్పు చేశారని, ఆ విషయం ఓటేసిన వారికి కూడా తెలుసని మస్క్ ఘాటుగా స్పందించారు. దీనికి స్పందించిన ట్రంప్.. ఈవీలపై ట్యాక్సులు వేస్తున్నందుకే టెస్లా సీఈవోకు కోపం వచ్చిందని తేల్చేశాడు. వీళ్లిద్దరి గొడవ రచ్చకెక్కి ‘ఎక్స్’లో ఒకరిపై మరొకరు తీవ్రమైన విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. ట్రంప్‌ను తనే ఎన్నికల్లో గెలిపించానని మస్క్ అంటే.. మస్క్‌కు మతి పోయిందని ట్రంప్ మండిపడ్డాడు. ఎంతోమంది సెలెబ్రిటీల చీకటి కోణాలను బయటపెట్టే ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ పూర్తిగా బయటకు రాలేదని, ఎందుకంటే అందులో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


అతనికి అసలు కృతజ్ఞతే లేదని, మస్క్ విషయంలో తను చాలా డిజప్పాయింట్ అయ్యానని ట్రంప్ అన్నాడు. మస్క్ తనకు ఎదురుతిరిగినందుకు తనకేం సమస్యలేదన్న ప్రెసిడెంట్.. బిల్లును మరోసారి సమర్థించుకున్నారు. అలాగే మస్క్‌తో యూఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తానని కూడా హెచ్చరించారు. దీనికి బదులిచ్చిన మస్క్.. నాసాతో స్పేస్‌ఎక్స్ చేసుకున్న ఒప్పందాన్ని తాము కూడా రద్దుచేసుకుంటామని, ‘డ్రాగన్’ స్పేస్‌‌క్రాఫ్ట్‌ను సర్వీసు నుంచి తొలగిస్తానని బెదిరించారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు మస్క్ ప్రకటించారు. అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌కు ఆహారం, సిబ్బందిని తీసుకెళ్లడానికి నాసా వద్ద ఉన్న ఏకైక సర్వీసు ‘డ్రాగన్’దే కావడం గమనార్హం.

వీళ్లిద్దరి గొడవ మరీ పెద్దదై యూఎస్ రహస్యాలు రోడ్డున పడటం ఇష్టంలేని కొందరు.. ఈ ఇద్దరూ మాట్లాడుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఇద్దర్నీ కాల్‌లో కలపాలని వైట్‌హౌస్ వర్గాలు ప్రయత్నించగా.. ట్రంప్ దీనికి కూడా ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికన్లను నిజంగా రిప్రజంట్ చేసేలా కొత్త పార్టీ పెట్టే సమయం వచ్చిందా? అని మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోల్ ప్రారంభించారు. దీంతో మస్క్ కూడా రాజకీయ అరంగేట్రం చేస్తారనే ప్రచారం యూఎస్‌లో జోరుగా సాగుతోంది. అయితే వీళ్లిద్దరు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం వాళ్ల వ్యాపారాలపై తీవ్రంగా ప్రభావం చూపించింది. టెస్లా షేర్ల ధరలు 14% తగ్గి కంపెనీకి 150 బిలియన్లు నష్టం వాటిల్లినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. అదే సమయంలో ట్రంప్ కంపెనీలు కూడా బాగానే నష్టాలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

Next Story