Fact Check: సమోసాల కోసం రైలును ఆపలేదు.. వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ! (వీడియో)

by Ramesh Naini |

సమోసాలు (టిఫిన్) కొనుగోలు చేయడం కోసం లోకో పైలట్ ఏకంగా రైలును ఆపేశాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పశ్చిమ రైల్వే తీవ్రంగా ఖండించింది.

Fact Check: సమోసాల కోసం రైలును ఆపలేదు.. వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమోసాలు (టిఫిన్) కొనుగోలు చేయడం కోసం లోకో పైలట్ ఏకంగా రైలును ఆపేశాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పశ్చిమ రైల్వే (Western Railway) తీవ్రంగా ఖండించింది. ఇదొక తప్పుడు ప్రచారమని స్పష్టం చేస్తూ అసలు వాస్తవాలను వెల్లడించింది.

ఆగింది గూడ్స్ రైలు.. ఎందుకు ఆగింది?

వీడియోలో చూపిస్తున్నట్లుగా అది ప్యాసింజర్ (DEMU) రైలు కాదు, అదొక గూడ్స్ రైలు అని స్పష్టం చేసింది. ఇండోర్ సమీపంలోని రావు (RAU) యార్డ్‌లో ముందుగా నిర్ణయించిన ఇంజనీరింగ్ పనుల కారణంగా, సిగ్నల్ దొరక్క గూడ్స్ రైలును హోమ్ సిగ్నల్ వద్ద నిలిపివేశారు. ఇది అధికారికంగా ఇచ్చిన విరామం (Operational Halt) మాత్రమే కానీ, ఆహారం కోసం ఉద్దేశపూర్వకంగా రైలును ఆపలేదు.

టిఫిన్ తెచ్చింది ఎవరు?..

రైలు ఆగి ఉన్న సమయంలో, రిజర్వ్‌లో ఉన్న (స్టాండ్‌బై) అసిస్టెంట్ లోకో పైలట్ వెళ్లి ఆహారం తీసుకువచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న (ఆన్-డ్యూటీ) లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లు తమ స్థానాల్లోనే ఉన్నారు. సగం సగం ఎడిట్ చేసిన వీడియో క్లిప్‌లను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి, రైల్వే సిబ్బందిపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని రత్లాం రైల్వే డివిజన్ పీఆర్వో ముఖేష్ కుమార్ తెలిపారు. ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలను నమ్మవద్దని, అధికారిక వర్గాల ద్వారా వాస్తవాలను నిర్ధారించుకోకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని రైల్వే శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Next Story