విషాదంగా ఢిల్లీ వర్సిటి విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ.. యమునా నదిలో మృతదేహం

by Yella Dhawani Reddy |

దేశ రాజధాని ఢిల్లీలో త్రిపురకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని స్నేహ దేబ్‌నాథ్ అదృశ్యమైన సంగతి తెలిసిందే.

విషాదంగా ఢిల్లీ వర్సిటి విద్యార్థిని మిస్సింగ్ మిస్టరీ.. యమునా నదిలో మృతదేహం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) త్రిపురకు (Tripura) చెందిన 19 ఏళ్ల విద్యార్థిని స్నేహ దేబ్‌నాథ్ అదృశ్యమైన సంగతి తెలిసిందే. స్నేహ కోసం పోలీసులు ఆరు రోజులుగా గాలిస్తుండగా, ఆమె మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. ఇవాళ (జులై 13) ఢిల్లీ ఫ్లైఓవర్‌ కింద పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఆత్మ రామ్ సనాతన ధర్మ కళాశాలలో చదువుతున్న స్నేహ దేబ్‌నాథ్ జులై 7 నుంచి కనిపించకుండా పోయింది. ఆ రోజు ఉదయం 5:56 గంటలకు ఆమె తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది. తన స్నేహితురాలు పిటునియాతో కలిసి సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నట్లు తెలిపింది.

అయితే ఆరోజు ఆమె పిటునియాను కలవలేదు.స్నేహ ఫోన్ జులై 7 ఉదయం 8:45 గంటల నుంచి స్విచ్ ఆఫ్‌లో ఉంది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు.దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్నేహితురాలితో వెళ్తున్నానని చెప్పిందని తెలిపారు. ఈ క్రమంలో పిటునియాను పోలీసులు సంప్రదించగా.. ఆ రోజు ఉదయం స్నేహాను తాను కలవలేదని చెప్పింది.చివరిగా ఒక క్యాబ్ డ్రైవర్ ఆమెను ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ సమీపంలో దింపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

దీంతో ఢిల్లీ పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), త్రిపుర పోలీసులు సిగ్నేచర్ బ్రిడ్జ్ చుట్టూ 7 కిలోమీటర్ల వ్యాసార్థంలో, యమునా నది పరిసరాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, సీసీటీవీ కవరేజ్ లేకపోవడంతో గాలింపు ప్రక్రియలో వారికి అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలో యమునా నది ఒడ్డున స్నేహ మృతదేహం లభ్యమైంది. మరోవైపు ఆమె గదిలో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసిన నోట్ లభించింది. అందులో 'నేను వైఫల్యంగా, భారంగా భావిస్తున్నాను. ఇలా జీవించడం అసహనీయంగా మారింది' అని రాసి ఉంది. అయితే, ఆమె సోదరి బిపాషా దేబ్‌నాథ్ ఈ నోట్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి వివరాలు లేకుండా నోట్ ఉందని పేర్కొంది. 'ఒకవేళ ఆత్మహత్యే చేసుకోవాలనుకుంటే, ఇంట్లోనే అనేక మార్గాలుంటాయి. కెమెరాలు పనిచేయని చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఇది ఏదైనా ప్లాన్ ప్రకారం జరిగిందా? అనేది అర్థం కావడం లేదు?’ అని అనేక ప్రశ్నలు లేవనెత్తింది.

Next Story