భారత రాజకీయాల్లో విషాదం.. కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-12 03:56:33  IST  )

భారతదేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

భారత రాజకీయాల్లో విషాదం.. కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ రాజకీయాల్లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్య..

కాగా, శివరాజ్ పాటిల్ 1935 అక్టోబర్ 12న అప్పటి హైదరాబాద్ సంస్థానానికి చెందిన (పస్తుత మహారాష్ట్రలోని) లాతూర్ జిల్లా మరాఠ్వాడా ప్రాంతంలోని చకూర్ గ్రామంలో జన్మించారు. ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైన్స్‌లో డిగ్రీ పొందారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1967-69 మధ్యకాలంలో శివరాజ్ పాటిల్ స్థానిక ప్రభుత్వంలో పనిచేశారు. పాటిల్ పంచమశాలి లింగాయత్ సమాజానికి చెందినవారు. ఆయన జూన్ 1963లో విజయా పాటిల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

కేంద్రంలో అత్యున్నత పదవుల్లో..

శివరాజ్ పాటిల్ రెండు సార్లు లాతూర్ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ సమయంలో ఆయన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా, న్యాయశాఖ, నీటిపారుదల, ప్రొటోకాల్ మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, స్పీకర్‌గా వివిధ పదవుల్లో కొనసాగారు. అనంతరం ఆయన 1980లో లాతూర్ నియోజకవర్గం నుంచి 7వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం ఏడు సార్లు అదే స్థానం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో శివరాజ్ పాటిల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రూపతై పాటిల్ నీలంగేకర్ చేతిలో ఓడిపోయారు. 2004 నుంచి 2008 వరకు భారత హోం మంత్రిగా, 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ 10వ స్పీకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత పంజాబ్ గవర్నర్‌గా, 2010 నుంచి 2015 వరకు చండీగఢ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్‌గా (లెఫ్టినెంట్ గవర్నర్‌గా) పనిచేశారు.

Next Story