హోలీ రోజు ఎర్రగా మారనున్న చంద్రుడు

by Ajay Maddhiboyina |

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్‌తో పాటు పశ్చిమఆఫ్రికా ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

హోలీ రోజు ఎర్రగా మారనున్న చంద్రుడు
X

- నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

- దాదాపు 65 నిమిషాల పాటు గ్రహణం

- ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం

- చిన్నగా కానున్న చంద్రుడు

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రంగు రంగుల హోలీ పండుగ జరుపుకుంటున్న శుభ సమయంలోనే చంద్రుడు ఎరుపు వర్ణంలోకి మారనున్నాడు. మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండగా.. అదే రోజు ఈ అరుదైన ఖగోళ దృశ్యం కూడా ఆవిష్కృతం కానుంది. మంచి, చెడులపై విజయంగా హోలీని దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటారు. ఇదే రోజున చంద్రగ్రహణం రానుండటం, చంద్రుడు ఎరుపు రంగులో కనిపించనుండటం అదనపు పండుగ శోభను తేనుంది. సాధారణంగా సూర్యుడు, చంద్రుడి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే చంద్రుడి ఉపరితం నీడ పడిన చోట సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. అయితే ఇది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కానుంది.

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్‌తో పాటు పశ్చిమఆఫ్రికా ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్, న్యూయార్క్‌తో పాటు యూరోప్‌లోని పారిస్, మాడ్రిడ్ నగరాల్లో ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఇక కాసాబ్లాంకా, డబ్లిన్, లిస్బన్, హోనలులు, బ్యూనస్ ఎయిర్స్, గ్వాటెమాల సిటి, చికాగో, శాంటియాగో, ఆక్లాండ్, వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కొంత మేరకు కనిపించే అవకాశం ఉంది. ఆంకారా, జొహెన్నస్‌బర్గ్, కైరో, ఏథెన్స్, రోమ్, బెర్లిన్, బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీ, సియోల్, లండన్ నగరాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది.

మార్చి 14న ఏర్పడే చంద్రగ్రహణం దాదాపు 65 నిమిషాల పాటు ఏర్పడనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే ప్రాంతాల్లో ఒక ఆకర్షణీయమైన దృశ్యం ఏర్పడుతుంది. అయితే ఈ రోజు చంద్రుడు కాస్త చిన్నగా కనపడనుంది. దీనిని మైక్రో మూన్ అని కూడా పిలుస్తుంటారు. భూమి నుంచి చంద్రుడు దూరంగా ఉండటం వల్లే మైక్రోమూన్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఇండియాలో పగటిపూట ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఇండియాలో ఈ బ్లడ్ మూన్‌ను చూడలేకపోయినా.. ఇతర ప్రాంతాల్లో మాత్రం ఒక ముఖ్యమైన ఖగోళ దృశ్యంగా నిలిచిపోనుంది. ఇండియాలో హోలీ రోజే ఈ అరుదైన చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

Next Story