Israeli airstrikes : వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ హతం : ఇజ్రాయెల్

by Ramesh Naini |

ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం IRGC టాప్ కమాండర్ మహమ్మద్ పక్పూర్ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించినట్లు ఆ దేశ రక్షణ దళాలు తెలిపాయి.

Israeli airstrikes : వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ హతం : ఇజ్రాయెల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్‌కు భారీ షాక్ తగిలింది. ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) కమాండర్ మహమ్మద్ పక్పూర్ (Mohammad Pakpour) శనివారం జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించినట్లు ఆ దేశ రక్షణ దళాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.

వరుసగా రెండో కమాండర్ హతం..

గతంలో ఐఆర్‌జీసీ కమాండర్‌గా ఉన్న హుస్సేన్ సలామీని ఇజ్రాయెల్ మట్టుబెట్టిన తర్వాత, పక్పూర్ ఆ బాధ్యతలను చేపట్టారు. కేవలం 260 రోజుల పాటు మాత్రమే పదవిలో ఉన్న ఆయన, ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడికి బలికావడం ఇరాన్ సైనిక యంత్రాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.

హెచ్చరించిన నెల రోజులకే..

ఇరాన్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో పక్పూర్ ఒకరు. గత నెలలోనే పక్పూర్ ఇజ్రాయెల్, అమెరికాలను ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ఇరాన్ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయవద్దు. మా వేళ్లు ఎప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయి. దేనికైనా మేము సిద్ధం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ హెచ్చరికలు చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

ఖమేనీకి అత్యంత నమ్మకస్తుడు!

2025లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పక్పూర్‌కు 'మేజర్ జనరల్'గా పదోన్నతి కల్పించారు. ఐఆర్‌జీసీ సామర్థ్యాన్ని పెంచడం, అంతర్గత సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి కీలక బాధ్యతలను ఖమేనీ నేరుగా ఆయనకే అప్పగించారు. అటువంటి కీలక నేత మరణంతో ఇరాన్ ఇప్పుడు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Next Story