పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తున్నారు?: సుప్రీంకోర్టు

by Prasad Jukanti |

వివాహానికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు

పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తున్నారు?: సుప్రీంకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వివాహానికి ముందే స్త్రీ, పురుషులు లైంగిక సంబంధం పెట్టుకోవడం పట్ల సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందే ఎవరూ ఎవరినీ నమ్మకూడదని ఓ బంధాన్ని ఏర్పరచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీ ఇచ్చి అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్‍పై ఇవాళ జస్టిస్ బి.వి నాగరత్న (Justice BV Nagarathna), జస్టిస్ ఉజ్జల్ భుయాన్‍లతో (Justice Ujjal Bhuyan) కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులని అందువల్ల వివాహానికి ముందు శారీరక సంబంధం పెట్టుకునే విషయంలో (Pre-marital Relationship) జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ధర్మాసనం మౌఖికంగా వ్యాఖ్యానించింది. బహుశా మేము పాతకాలపు ఆలోచనల వాళ్లమేమో.. కానీ వివాహానికి ముందు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పరస్పరం అపరిచితులే. వారి సంబంధం ఎంత గాఢంగా ఉన్నా, పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో మాకు అర్థం కావడం లేదని విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న అన్నారు. పెళ్లికి ముందు ఎవరినీ పూర్తిగా నమ్మకూడదని చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కేసు నేపథ్యం ఏమిటంటే:

బాధిత మహిళకు పిటిషన్ దారుడికి 2022లో మ్యాట్రిమొనీ వెబ్‍సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటానని నమ్మించిన ఆ వ్యక్తి అనేక సార్లు ఢిల్లీ, దుబాయ్‍లో ఆ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో వారు ఏకంతంగా గడిపిన సమయంలో సదరు మహిళకు తెలియకుండానే ఆ వ్యక్తి వీడియోలు రికార్డు చేశాడు. ఆ తర్వాత ఎదురు తిరిగితే ఈ వీడియోలను బయట పెడతానని బెదిరించాడు. అయితే అతడికి ఇది వరకే వివాహం జరిగిందని ఇంతలో 2024 జనవరిలో పంజాబ్ లో మరో మహిళను వివాహం చేసుకున్నట్లు బాధితురాలు గుర్తించింది. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దీనిపై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

దుబాయ్‍కు ఎందుకెళ్లారు?:

అతని బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఫిర్యాదుదారు పిటిషనర్‌ను కలవడానికి దుబాయికి ఎందుకు వెళ్లిందని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇద్దరూ ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పరిచయమై, వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారని వెల్లడించగా, మహిళ వివాహంపై అంతగా కట్టుబడి ఉంటే పెళ్లికి ముందే ప్రయాణం చేయకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులు విచారణ చేసి శిక్ష విధించేందుకు తగినవికావని ఇరుపక్షాలను మధ్యవర్తిత్వం (మెడియేషన్)కు పంపాలని సూచించారు. వివాహంపై అంత కట్టుదిట్టంగా ఉంటే, పెళ్లికి ముందే వెళ్లకూడదు. మేము వీరిని మెడియేషన్‌కు పంపిస్తాము. పరస్పర సమ్మతితో ఉన్న సంబంధం ఉన్నప్పుడు ఇవి విచారణ చేసి శిక్షించాల్సిన కేసులు కావు అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేసును బుధవారం వరకు వాయిదా వేశారు.

Next Story