అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు బాధ్యతల స్వీకరణ

by Ajay Maddhiboyina |

2016లో తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు కేవలం ఒకే ఆర్డర్‌పై సంతకాలు చేశారు.

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు బాధ్యతల స్వీకరణ
X

- యూఎస్ కేపిటల్ బిల్డింగ్ లోపల ఏర్పాట్లు

- హాజరుకానున్న ప్రముఖులు

- తొలి రోజే 10 ఆర్డర్స్ మీద సంతకాలు

దిశ, నేషనల్ బ్యూరో:

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలు) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యునైటెడ్ స్టేట్స్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్స్ యూఎస్ క్యాపిటల్‌లో జరిగే ఇనాగరేషన్ డే కార్యక్రమంలో ట్రంప్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సాంప్రదాయం ప్రకారం క్యాపిటల్ బిల్డింగ్ బయట ఈ కార్యక్రమం నిర్వహించాలి. కానీ ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా వాషింగ్టన్ డీసీలో అత్యంత చలిగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని బిల్డింగ్ లోపలికి మార్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ తొలి ప్రసంగం చేయనున్నారు. వాస్తవానికి వైట్ హౌస్ వరకు మిలటరీ, స్కూల్ బ్యాండ్స్, అమెరికా పౌరులతో పరేడ్‌ను నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్యాపిటల్ వన్ ఎరేనాలోనే పరేడ్ నిర్వహించనున్నారు. గతంలో ఉన్న సాంప్రదాయాలను బ్రేక్ చేస్తూ ట్రంప్ తొలి సారిగా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అయితే అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే మాత్రమే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ట్రంప్ అడ్వయిజర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెజాన్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ జెఫ్ బెజోస్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు పలువురు బిలియనీర్లు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

తొలి రోజే 10 ఆర్డర్లపై సంతకాలు

2016లో తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు కేవలం ఒకే ఆర్డర్‌పై సంతకాలు చేశారు. అప్పట్లో 'ఒబామా కేర్'ను రద్దు చేస్తూ ఆయన తొలి సంతకం చేశారు. కానీ ఈ సారి ఏకంగా 10 ఆర్డర్లపై సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన అనేక హామీలపై తొలి రోజే సంతకాలు పెట్టాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇవి అమెరికా చరిత్రలోనే కీలకమైన ఆర్డర్లుగా నిలవనున్నాయి.

1. సామూహిక బహిష్కరణ

డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి అక్రమ వలసదారులపై సీరియస్‌గా ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే అందరినీ దేశం నుంచి బహిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు ట్రంప్ తొలి సంతకం సామూహిక బహిష్కరణ (మాస్ డిపోర్టేషన్) పైనే ఉండనుంది. డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా దేశంలోకి వచ్చి నివసిస్తున్న అనేక మందిని ఒకే సారి అమెరికా నుంచి బహిష్కరించనున్నారు. అమెరికా చరిత్రలోనే ఇది తొలి సామూహిక బహిష్కరణగా నిలవనుంది. అయితే సామూహిక బహిష్కరణ అమలు చేయడం అంత సులువు కాదని, అందరినీ దేశ సరిహద్దులు దాటించడం చాలా కష్టమని కొంత మంది వాదిస్తున్నారు. ట్రంప్ మాత్రం ఈ పని చేసి తీరుతాననే పట్టుదలతో ఉన్నారు.

2. జన్మతా వచ్చే పౌరసత్వం రద్దు

అమెరికాలో పుట్టే ప్రతీ ఒక్కరికి జన్మతా పౌరసత్యం వస్తుంది. అమెరికా ఎయిర్ స్పేస్‌లో ప్రయాణిస్తున్న విమానంలో జన్మించినా వారికి యూఎస్ సిటిజన్‌షిప్ వస్తుంది. ఇకపై విదేశీయులకు పుట్టే బిడ్డలకు జన్మతా వచ్చే పౌరసత్వపు హక్కును రద్దు చేయనున్నారు. అయితే ఈ ఉత్తర్వుకు కూడా అనేక న్యాయపరమైన అడ్డంకులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ మాత్రం ఈ హామీని అమలు చేసి తీరతానని చెబుతున్నారు.

3. కాపిటల్ హిల్ అల్లర్ల నిందితులకు క్షమాభిక్ష

2021 జనవరి 6న యూఎస్ కాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన దాడి, అల్లర్ల కేసులో దోషులుగా తేలిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే ఉత్తర్వుపై కూడా ట్రంప్ సంతకం చేయనున్నారు. దీంతో పాటు పలు నేరాల్లో శిక్షలు పడిన వారికి క్షమాభిక్ష పెట్టే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటానని ట్రంప్ చెప్పారు.

4. రష్యా-యూక్రెయిన్ యుద్దానికి ముగింపు

ఫారన్ పాలసీలో భాగంగా తాను బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోగా రష్యా-యూక్రెయిన్ యుద్దానికి ముగింపు పలుకుతానని ట్రంప్ చెప్పారు. తనకు యూక్రెయిన్ ప్రెసిడెంట్ జెన్‌స్కీ బాగా పరిచయమని, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. తనకు ఉన్న సాన్నిహిత్యంతో రెండు దేశాల మధ్య యుద్దాన్నిఆపే అంశంపై తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఫారన్ పాలసీలో భాగంగా దీనికి సంబంధించిన ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేయనున్నారు.

5. దిగుమతి సుంకాన్ని పెంపు

అమెరికా పొరుగు దేశాలపైన మెక్సికో, కెనడాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాన్ని పెంచుతానని ట్రంప్ గతంలో చెప్పారు. ఈ మేరకు తొలి రోజే ఉత్తర్వులు వెలువరించనున్నారు. పొరుగు దేశాల ప్రొడక్ట్స్‌పై అధిక సుంకాలు వేయడం వల్ల కొనుగోళ్లు తగ్గి, అమెరికా వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఇది యూఎస్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

6. విద్యుత్ వాహనాలపై బైడెన్ తీసుకున్న నిర్ణయం రద్దు

విద్యుత్ వాహనాల విషయంలో ప్రెసిడెంట్ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసే ఉత్తర్వుపై కూడా ట్రంప్ సంతకం చేయనున్నారు. 2030 కల్లా దేశంలో అమ్మే 50 శాతం కార్లు, ట్రక్కులు జీరో ఎమిషన్ కలిగి ఉండాలని, అవన్నీ విద్యుత్ వాహనాలై ఉండాలని బైడెన్ గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు వాటిని ట్రంప్ రద్దు చేయనున్నారు.

7. చమురు తవ్వకాల పెంపు

అమెరికాలో ఉన్న చమురు నిల్వలను మరింతగా వెలికి తీసే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేయనున్నారు. చమురు ఉత్పత్తిని మరింతగా పెంచడం వల్ల అమెరికాలో ఆయిల్ ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్ అంచనా వేస్తున్నారు.

8. ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లపై నిషేధం

ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు మహిళల విభాగం నుంచి పోటీ చేయడంపై ట్రంప్ నిషేధం విధించనున్నారు. మహిళల ఆటల నుంచి పురుషుల సామర్థ్యాన్ని కలిగి ఉన్న వారిని తప్పిస్తానని గతంలో ట్రంప్ ఇచ్చిన హామీని తొలి రోజే నెరవేర్చనున్నారు.

9. లింగ మార్పిడిపై కఠిన నిబంధనలు

లింగమార్పిడికి సంబంధించిన పలు చికిత్సలపై కఠిన నిబంధనలు అమలు చేసే ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీనికి సంబంధించిన హార్మోన్ థెరపీకి స్వస్తి పలికేలా ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

10. మేడిన్ అమెరికా ఆటోమొబైల్స్

అమెరికన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని పరిరక్షించేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమెరికన్లు స్థాపించిన ఆటోమొబైల్ సంస్థల్లో అమెరికన్లచే తయారు చేయబడిన, అమెరికన్లచే సప్లయి చేయబడిన కార్లు, ట్రక్కులు ఇతర వాహనాలు అమ్మేలా చర్యలు తీసుకోనున్నారు. ఇది అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఊతం కానుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story