రాష్ట్రంలో పులుల దాడులు.. ఇద్దరు మృతి

by Naga Rani Yarlagadda |

మహారాష్ట్రలో పులుల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 12 గంటల్లో రెండు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందారు.

రాష్ట్రంలో పులుల దాడులు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పులుల దాడులు ప్రజలను భయపెడుతున్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో 12 గంటల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు పులులు దాడి చేసిన ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనలతో జిల్లాలో మానవ - వన్యప్రాణి సంఘర్షణ మరోసారి తీవ్రరూపం దాల్చింది. శనివారం ఉదయం ముల్ తాలూకాలోని సోమనాథ్ పరిధిలో ఉన్న ఆమ్టే ఫామ్ వద్ద తొలి దాడి జరిగింది. మరోడా గ్రామానికి చెందిన సునీత శాంరావు భోయర్ (45) అనే మహిళ ఇతర కూలీలతో కలిసి పత్తి ఏరుతుండగా, సమీపంలోని పొదల్లో పొంచి ఉన్న పులి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. తోటి కూలీలు కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయినప్పటికీ, తీవ్ర గాయాలైన సునీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మృతదేహాన్ని తరలించకుండా నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ముల్ ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కట్టెల వేటలో వృద్ధుడు మృతి

దీనికి కొద్ది గంటల ముందే.. శుక్రవారం సాయంత్రం మోహర్లీ బఫర్ జోన్‌ పరిధిలోని వర్వత్ గ్రామానికి చెందిన కాశీనాథ్ శివరామ్ లోన్బాలే (60) అనే వృద్ధుడు పులి దాడిలో మరణించాడు. సాయంత్రం 6 గంటల సమయంలో కట్టెలు ఏరడానికి అడవిలోకి వెళ్లిన కాశీనాథ్‌పై పులి దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాలను అటవీ, పోలీస్ బృందాలు సందర్శించాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంతోష్ థిపే, పోలీస్ ఇన్‌స్పెక్టర్ సందీప్ ఏకాడే పర్యవేక్షణలో సహాయక చర్యలు చేపట్టారు. పులి కదలికలను కనిపెట్టేందుకు ఆయా ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. మృతుడు లోన్బాలే కుటుంబానికి తక్షణ సహాయంగా రూ. 50,000 చెక్కును అందజేశారు.

ఈ ఏడాది జిల్లాలో వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఐదుగురు పులి దాడిలో, ఒకరు చిరుత దాడిలో మరణించారు. గతేడాది (2025) జిల్లాలో మొత్తం 47 మంది వన్యప్రాణుల దాడుల్లో మరణించగా, అందులో 42 మరణాలకు పులులే కారణం కావడం గమనార్హం.

Next Story