- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలో చేరిన ముగ్గురు టీఎంసీ (TMC) మాజీ ఎంపీలు!
టీఎంసీ కి చెందిన ముగ్గురు ప్రముఖ మాజీ రాజ్యసభ సభ్యులు గురువారం (జూలై 9, 2026) అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి కోల్‌కతాలో భారీ షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా టీఎంసీ కి చెందిన ముగ్గురు ప్రముఖ మాజీ రాజ్యసభ సభ్యులు గురువారం (జూలై 9, 2026) అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సమక్షంలో సుస్మితా దేవ్ (Sushmita Dev), సుఖేందు శేఖర్ రాయ్ (Sukhendu Sekhar Roy), ప్రకాష్ చిక్ బారైక్ (Prakash Chik Baraik) కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేసి మరీ కమలం గూటికి
ఈ ముగ్గురు నేతలు గత నెలలోనే టీఎంసీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే తమ రాజ్యసభ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీలో విభేదాలు పెరగడం, సుమారు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు పక్షం వైపు మొగ్గు చూపడంతో బెంగాల్ రాజకీయం వేడెక్కింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య మాట్లాడుతూ.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ ముగ్గురు సీనియర్ నేతల చేరికతో బెంగాల్‌లో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, పార్టీని వీడిన వారిపై టీఎంసీ నేత కునాల్ ఘోష్ మండిపడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ముగ్గురి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.






