జమిలి ఎన్నికలు ఓకే.. కానీ ఈసీకి అందించే అధికారాలపై మాజీ సీజేఐల ప్రశ్నలు!

by Phanindra |

జమిలి ఎన్నికలకు ఓకే అన్న మాజీ సీజేఐలు. కానీ ఈసీకి అందించే అధికారాలపై ప్రశ్నలు!

జమిలి ఎన్నికలు ఓకే.. కానీ ఈసీకి అందించే అధికారాలపై మాజీ సీజేఐల ప్రశ్నలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనకు ముగ్గురు మాజీ సీజేఐలు మద్దతిచ్చారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుపై ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీకి తమ అభిప్రాయాలను తెలియజేసిన ఈ ముగ్గురూ.. బిల్లులోని కొన్ని అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే ఎన్నికల సంఘానికి ఇచ్చే పవర్‌పై కూడా ఆందోళన వ్యక్తం చేసి, కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం రాజ్యంగానికి విరుద్ధమనే ప్రతిపక్ష వాదనను మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. పార్లమెంటరీ కమిటీకి తన అభిప్రాయాలను తెలియజేసిన ఆయన.. రాజ్యంగంలో ఎక్కడా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు వేరు వేరుగానే నిర్వహించాలని పేర్కొనలేదని స్పష్టంచేశారు. అదే సమయంలో చంద్రచూడ్‌తోపాటు మరో మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ కూడా ఎన్నికల కమిషన్‌కు అందించే అధికారాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈసీ తీసుకునే నిర్ణయాలపై సరైన గైడ్‌లైన్స్ లేకుండా ఇలా అధికారం ఇవ్వడం కరెక్ట్ కాదని వీరిద్దరూ అభిప్రాయపడినట్లు సమాచారం.

చంద్రచూడ్, మరో మాజీ సీజేఐ జే ఎస్ కేహర్ ఇద్దరూ కూడా జులై 11న బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు హాజరవ్వాల్సి ఉంది. ఈ సమయంలో కమిటీ సభ్యులందరూ బిల్లుపై ఇద్దరు సీజేఐల అభిప్రాయాలను తెలుసుకునే వీలుంటుంది. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుతో ఈసీకి భారీగా అధికారాలు అందిస్తే.. ఆ తర్వాత రాజ్యాంగంలో నిర్దేశించిన ఐదేండ్ల పరిమితికి ఇబ్బంది కలగొచ్చని చంద్రచూడ్ హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ పోల్స్ నిర్వహించడం కుదరకపోవచ్చనే సాకుతో కొన్ని అసెంబ్లీల కాలపరిమితిని ఈసీ పెంచే ప్రమాదముందన్నారు. ఈ అధికారాన్ని ఈసీ ఎప్పుడు వాడొచ్చనే అంశాన్ని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో మాజీ సీజేఐలు యూయూ లలిత్, రంజన్ గొగోయ్ కూడా పార్లమెంటరీ కమిటీ ముందు హాజరయ్యారు. ఆ సమయంలో ఈసీకి అందించే అధికారాలపై కొందరు సభ్యులు లేవనెత్తిన అనుమానాలను వారు సమర్థించినట్లు సమాచారం. అయితే మాజీ సీజేఐల్లో ఎవరూ కూడా జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పకపోవడం గమనార్హం.

Next Story