- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లాలో వేలాదిమంది మహిళలకు క్యాన్సర్ ? ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి
మహారాష్ట్ర హింగోలి జిల్లాలో వేలాది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర హింగోలి జిల్లాలో వేలాది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. సంజీవని పథకం కింద, రాష్ట్ర ఆరోగ్య శాఖ చేపట్టిన స్క్రీనింగ్ కార్యక్రమంలో వేలాదిమంది మహిళల్లో అనుమానిత క్యాన్సర్ లక్షణాలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రకాశ్ అబిత్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 8 నుంచి ఇప్పటివరకు 2,92,996 మంది మహిళలపై సర్వే నిర్వహించగా, వారి సమాధానాల ఆధారంగా 14,542 మందిలో క్యాన్సర్‌కు గల సూచనలున్నట్టు గుర్తించారు.
తదుపరి పరీక్షల తరువాత ముగ్గురు గర్భాశయ క్యాన్సర్‌తో, ఒకరు రొమ్ము క్యాన్సర్‌తో, ఎనిమిది మంది నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స కోసం వీరికి తగిన వైద్య సాయం అందించేందుకు హింగోలిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మంత్రి తెలిపారు. అయితే.. ప్రత్యేకంగా మహిళల కోసం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేసే యోచన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహిస్తూ, జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉంచుతున్నట్టు ఆయన వెల్లడించారు.
టాటా మెమోరియల్ ఆసుపత్రిలో శిక్షణ పొందిన క్యాన్సర్ వారియర్స్ ప్రతి నెలా రెండు సార్లు 11 ఆసుపత్రులను నిపుణులతో కలిసి సందర్శిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో డే కేర్ కీమోథెరపీ కేంద్రాలు ప్రారంభించామని, మిగిలిన జిల్లాల్లోనూ ఇవి ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.






