- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల వేషంలో వచ్చి పట్టపగలే దోపిడీ.. బెంగుళూరులో భారీ దొంగతనం
పోలీసులమని నమ్మించి ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు, తుపాకీతో బెదిరించి సుమారు 20 లక్షల నగదు, అర కిలో బంగారు నగలను దోచుకెళ్లినట్లు కలకలం రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక రాజధాని బెంగుళూరులో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. పోలీసులమని నమ్మించి ఓ ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు, తుపాకీతో బెదిరించి సుమారు 20 లక్షల నగదు, అర కిలో బంగారు నగలను దోచుకెళ్లినట్లు కలకలం రేపుతోంది. ఈ సంచలన ఘటన నగరంలోని బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే.. బ్యాడరహళ్లి నివాసి అయిన హోంబలే గౌడ (53), ఆయన భార్య మంగళమ్మ, మనవడితో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారిలో ఒకరు సబ్ ఇన్ స్పెక్టర్ యూనిఫాంలో ప్రైవేట్ కారులో రాగా, మరొకరు క్రైమ్ సీన్ ఆఫీసర్‌లా బ్యాగ్‌తో ప్రత్యక్షమయ్యారు. తాము స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తనిఖీ కోసం వచ్చామని నమ్మించి వారు ఇంట్లోకి ప్రవేశించారు.
తుపాకీతో బెదిరించి.. టేపుతో కట్టేసి..
ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే నిందితులు తమ అసలు స్వరూపం చూపించారు. తుపాకీ, కత్తితో దంపతులను బెదిరించి గదిలో బంధించారు. అనంతరం ప్లాస్టర్ (Tape) సహాయంతో దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి నోళ్లు మూసేశారు. పడకగదిని అస్తవ్యస్తం చేసి, దొరికినకాడికి నగదు, నగలను బ్యాగుల్లో సర్దుకున్నారు. సుమారు రూ. 20 లక్షల నగదుతో పాటు 500 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు బాధితులు వాపోయారు. బాధితుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా లాక్కున్న దుండగులు, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంట్లోని CCTV DVR ను కూడా తమతో పాటు తీసుకెళ్లడం గమనార్హం.
మంగళసూత్రాన్ని వదిలేసిన దొంగలు..
దొంగతనానికి వచ్చిన వారిని చూసి భయాందోళనకు గురైన హోంబలే గౌడ.. తమను చంపొద్దని, కావాలంటే తన భార్య మెడలోని మంగళసూత్రాన్ని కూడా తీసుకోమని వేడుకున్నారు. అయితే, నిందితులు ఆ మంగళసూత్రాన్ని మాత్రం ముట్టుకోకుండా వదిలేసి వెళ్లినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వేషధారణలో వచ్చి ఈ భారీ దోపిడీకి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నాయి.






