- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పనంగా వచ్చిందని అమ్మేశారు..! రూ.1.5 కోట్ల విలువైన ఎల్‌పీజీ చోరీ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ దేశంలో రూ. 1.5 కోట్ల విలువైన ఎల్‌పీజీ చోరీ కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత వేధిస్తున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పోలీసుల సంరక్షణలో ఉన్న 6 గ్యాస్ ట్యాంకర్ల నుంచి సుమారు 92 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ (LPG)ని మళ్లించి, బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు తేలింది. దీని విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కుంభకోణం వెనుక ప్రభుత్వ అధికారి..?
అయితే ఈ మొత్తం కుంభకోణంలో నిందితుల్లో ఒక జిల్లా ఫుడ్ ఆఫీసర్ (District Food Officer) కూడా ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కుంభకోణంలో ఫుడ్ ఆఫీసర్ అజయ్ యాదవ్, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు పంకజ్ చంద్రకర్, మధ్యవర్తి మనీష్ చౌదరి, ఠాకూర్ పెట్రోకెమికల్స్ యజమాని సంతోష్ సింగ్ ఠాకూర్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. గత డిసెంబర్‌లో అక్రమ రీఫిల్లింగ్ ఆరోపణలతో సింఘోరా పోలీసులు 6 గ్యాస్ ట్యాంకర్లను సీజ్ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా భద్రతా కారణాలతో వీటిని మార్చి 30న ఫుడ్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. ట్యాంకర్లను సురక్షిత ప్రాంతానికి తరలించే సాకుతో, నిందితులు వాటిని రాయ్‌పూర్ (Raipur)లోని ఓ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి తరలించారు. అక్కడ వారం రోజుల పాటు క్రమంగా గ్యాస్‌ను దొంగలించి, నకిలీ వే బిల్లులు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్లాక్ మార్కెట్లో అమ్మేశారు. ఈ మొత్తం డీల్ సుమారు రూ.80 లక్షలకు కుదిరినట్లు, అందులో రూ.50 లక్షలు నేరుగా ఫుడ్ ఆఫీసర్ అజయ్ యాదవ్‌కు అందినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
విషయం బయటపడింది ఇలా..
ట్యాంకర్ల అసలు యజమానులు తమ వాహనాలను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు గ్యాస్ తక్కువగా ఉండటంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేశారు. జీపీఎస్ ట్రాకింగ్ (GPS Tracking), కంపెనీ విక్రయ రికార్డులను పరిశీలించగా, కంపెనీ వద్ద స్టాక్ లేకపోయినా భారీగా గ్యాస్ అమ్మినట్లుగా తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.






